ఆఫ్రికాలో టెలికం కార్యకలాపాలు ఆరంభించడం ద్వారా ప్రపంచంలోని టాప్ 5 టెలికం సంస్థల్లో ఒకటిగా నిలవాలన్న భారతీ ఎయిర్టెల్ ఆశలు ఇప్పట్లో సఫలమయ్యేలా లేవు. నైజీరియాలో జైన్‌తో కలిసి టెలికం సేవలందిస్తున్న ఎకోనెట్ వైర్లెస్ ఈ డీల్‌ను అంగీకరించడం లేదని సమాచారం. ఇప్పటికే ఆఫ్రికాలోని మొరాకో, సూడాన్లను వదిలేసుకున్న ఎయిర్టెల్ నైజీరియాను ఎలాగైనా కలుపుకోవాలని లేదంటే డీల్‌ను రద్దు చేసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.కువైట్ టెలికం సంస్థ జైన్‌తో ఒప్పందం తుది రూపాన్ని సంతరించుకుంటున్న వేళ మరో అడ్డంకి ఎదురైంది.
ఆఫ్రికాలోని పెద్ద దేశాల్లో ఒకటైన నైజీరియాలో జైన్‌తో కలిసి టెలికం సేవలందిస్తున్న ఎకోనెట్ వైర్లెస్ భారతీతో డీల్ తమకు ఆమోదయోగ్యం కాదని అడ్డం తిరిగింది. నిజానికి జైన్‌లో ఎకోనెట్ వాటా చాలా స్వల్పమైనప్పటికీ, నైజీరియన్ యూనిట్లో ఎకోనట్ వాటా 65 శాతంగా ఉంది.. ఎప్పటినుంచో ఎకోనట్ పూర్తిగా తమకు యూనిట్‌ను అప్పగించాలని జైన్‌ను కోరుతోంది. ఇప్పుడు ఎకోనట్ అనుమతి లేకుండా తమ వాటాను ఎలా విక్రయిస్తారని సంస్థ చైర్మన్ స్ట్రైవ్ మిసాయివా వ్యాఖ్యానించారు. ఆఫ్రికా టెలికం రంగంపై నివేదిక తయారు చేసే నిమిత్తం గోల్డ్‌మన్ సాక్స్ ఎనలిస్ట్ హ్యూగ్ మెక్ కాఫ్రీ ఇటీవల మిసాయివాను కలిశారు. మెక్ ఇచ్చిన నివేదిక ప్రకారం నైజీరియా కార్యకలాపాలు అమ్మకానికి లేవు. జైన్, ఎకోనట్ల మధ్య యాజమాన్య వివాదం కొనసాగుతున్నందున అది తేలేంత వరకూ తాము ఒప్పందాన్ని అంగీకరింజబోమని మిసాయివా స్పష్టం చేశారని మెక్ నివేదికలో వెల్లడించారు.
నైజీరియాలో జైన్ యాజమాన్యాన్ని సవాలు చేస్తూ, ఆ దేశపు కోర్టులతో పాటు డచ్ కోర్టులో సైతం కేసులు విచారణ దశలో ఉన్నాయి. జైన్ ఉన్నతాధికారులు భారతీ ఎయిర్టెల్ బోర్డుకు ఈ విషయాలన్నింటినీ వివరించే ఉంటారని భావిస్తున్నామని ఎకోనట్ మేనేజ్మెంట్ తెలిపింది. కాగా, ఇటువంటి వివాదాలు వస్తాయని ముందుగానే ఊహించి తగు జాగ్రత్తలు తీసుకున్నామని భారతీ అధికారి ఒకరు తెలిపారు.
జైన్ బోర్డుతో తమకు ఎటువంటి వివాదాలు లేవని, ఇతర సంస్థలతో కొనసాగుతున్న లావాదేవీలను జైన్ చూసుకుంటుందని ఆయన వివరించారు. ఈ వివాదం మరింతగా బలీయమైతే భారతీ ఎయిర్టెల్ నైజీరియా వాటాను వదులుకోకతప్పదని మెక్ తన నివేదికలో పేర్కొన్నారు. నైజీరియా యూనిట్లో 65 శాతమున్న ఎకోనెట్ను కలుపుకోకుండా జైన్ కార్యకలాపాలను ఆ దేశంలో భారతీ సొంతం చేసుకోవడం ఎంతమాత్రం సాధ్యం కాదు. ఓనర్షిప్ రైట్స్ మార్పిడి వ్యవహారంలో జైన్ వైఖరిని తప్పు పడుతూ పరిహారం కోసం ఎకోనెట్ కోర్టులను ఆశ్రయించేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం.
10.7 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంపై మార్చి నెలాఖరులో ఇరు కంపెనీలూ సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. కొత్త ఆర్థిక సంవత్సరంలో అన్ని ఆఫ్రికా దేశాల మార్కెట్ల రెగ్యులేటరీ అనుమతులు పొందిన తరువాత ఒప్పందం అమలవుతుంది. ఒప్పందంపై సంతకాల అనంతరం ఇక ఏ విధనైన అడ్డంకులూ తమకు లేవని వ్యాఖ్యానించడం గమనార్హం.