ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ దక్కన్ చార్జర్స్ పరాజయం పాలైంది. సౌరబ్ త్రివేది 20 ఓవర్లో అనూహ్యంగా మూడు వికెట్లు కూల్చి చార్జర్స్‌ను దెబ్బతీసి తమ రాజస్థాన్‌ను 2 పరుగుల స్వల్ప తేడాతో గెలిపించాడు. సోమవారం నాడిక్కడ విదర్భ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా చార్జర్స్ బౌలింగ్‌లో రాణించి, రాజస్థాన్ రాయల్స్‌ను 159 పరుగులకే కట్టడి చేసినప్పటికీ ఆ స్వల్ప లక్ష్యాన్ని సైతం చేధించలేక చతికిలబడింది. డాషింగ్ హిట్టర్ రోహిత్‌శర్మ ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడి 73 పరుగులు చేసినప్పటికీ ఆఖరి ఓవర్లో విజయానికి కావాల్సిన పరుగులను అందించలేకపోయాడు.
19 ఓవర్లో 13 పరుగులు సాధించి విజయానికి చేరువలోకి వచ్చిన చార్జర్స్ ఆఖరి ఓవర్లోతమకు అవసరమైన మిగతా 6 పరుగులను అందుకోలేక మరో బంతి ఉండగానే ఆలౌట్ అయింది.157 పరుగుల వద్ద రోహిత్‌ను త్రివేది అవుట్ చేసి మ్యాచ్‌ను తమవైపు మళ్ళించాడు. 20 ఓవర్లో చార్జర్స్ ఆఖరి మూడు వికెట్లను సాధించి రాయల్స్ ఐదో విజయాన్ని అందుకోవడంద్వారా సెమీస్ అవకాశాలను సుగమం చేసుకుంది. ప్రస్తుతం ఆ జట్టు 10 పాయింట్లతో మెరుగైన స్థానంలో ఉంది. చార్జర్స్ జట్టులో కెప్టెన్ గిల్‌క్రిస్ట్ (34) మినహా మిగతా వారంతా విఫలమైనప్పటికీ రోహిత్ దాదాపు ఒంటరి పోరాటం జరిపి 44 బంతుల్లో 8 బౌండరీలు 2 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు.
వీరిద్దరూ కాకుండా రెండెంకల స్కోరుకు ఒక్క సైమండ్స్ (15) మాత్రమే చేరుకోగా మిగతా వారంతా వరుసగా పెవిలియన్ దారి పట్టారు. 14 ఓవర్లో అనిరుధ్‌ను ఆ తర్వాత తదుపరి ఓవర్లో స్మిత్, 18 వ ఓవర్లో బిలాకియాను అవుట్ చేసి వార్న్ రాయల్స్‌కు ఆశలు కలిగించాడు. అతడు మొత్తం 21 పరుగులకు 4 వికెట్లు కూల్చి తన జట్టును గట్టెక్కించాడు. అంతకుముందు దక్కన్ చార్జర్స్ బౌలర్లు ఆర్పి సింగ్, హర్మిత్‌సింగ్ అలాగే హారిస్ విశేషరీతిలో రాణించి ఆఖరి ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్‌ను కట్టడి చేయగలిగారు. ఒక దశలో180 పరుగులు పైగా చేస్తుందనుకున్న రాయల్స్‌కు కేవలం 31 పరుగులే ఇచ్చి 6 వికెట్లు కొల్లగొట్టడంతో టాస్ గెలిచి తొలి బ్యాటింగ్ చేసిన వారి ఇన్నింగ్స్ 159 పరుగులకే ముగిసింది.
వాట్సన్ (36 బంతుల్లో58) మరోసారి అద్బుతంగా రాణించి హాఫ్ సెంచరీ చేయడం వల్ల ఆ మాత్రమైనా చేయగలిగింది. 17 పరుగులకే రెండు వికెట్లు కొల్పోయిన రాయల్స్‌ను వాట్సన్, ఫజల్ కలిసి ధాటిగా ఆడి ఆదుకున్నారు. వీరిద్దరి విజంభణతో 11 ఓవర్ ముగిసేటప్పటికీ 94 పరుగులకు చేరుకోగలిగింది. ఆ దశలో బ్యాటింగ్‌కు దిగిన వారి విధ్వంసక బ్యాట్స్‌మన్ యూసఫ్ పఠాన్‌ను (5) హారిస్ ఒక షార్ట్ డెలివరీ బాల్‌తో అవుట్ చేసి దెబ్బతీశాడు. అయినప్పటికీ ఈ ఐపిఎల్‌లో రెండో మ్యాచ్ ఆడిన వాట్సన్ రెండో హాఫ్ సెంచరీ చేసి కొంత తేరుకునేలా చేశాడు.
16వ ఓవర్లో హర్మిత్ రెండు వికెట్లు కూల్చి దక్కన్ చార్జర్స్ అవకాశాలు పెంచాడు. ఆ తదుపరి ఓవర్లో నే ఆర్పి సంధించిన స్లోబౌన్సర్కు వాట్సన్ వికెట్ అప్పగించి తిరిగి వచ్చాడు. ఇక ఇక్కడినుంచి ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టారు. రాయల్స్ కెప్టెన్ వార్న్ రనౌట్ కాగా, త్రివేదిని (9) స్మిత్ బౌల్డ్ చేశాడు. దీంతో ఒక దశలో 103-3 పరుగుల స్కోరుతో ఉన్న రాయల్స్ చివరి బంతి మిగిలి ఉండగానే159 స్కోరుకు ఆలౌట్ అయింది.