చౌక ధరకు వస్తుందని నానో కారును కొనుగోలు చేసేందుకు దేశ పౌరులు అధిక ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఈ కారును ఇప్పటికే కొనుగోలు చేసిన వినియోగిస్తున్న యజమానుల బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అల్లాడుతున్నారు.
ఇటీవలి కాలంలో నానోకార్లు అగ్నిప్రమాదానికి గురవుతున్న సంఘటనలు దేశ వ్యాప్తంగా వినొస్తున్నాయి. ఈనెల 15వ తేదీన ముంబైలో జరిగిన ప్రమాదానికి ముందు మూడు నానో కార్లు ఇదే తరహాలో వివిధ ప్రాంతాల్లో ప్రమాదానికి గురయ్యాయి. అయితే, ఈనెల 15వ తేదీన జరిగిన ప్రమాదమే ఎక్కువ నష్టాన్ని కలిగించింది.
ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలి బూడిదైపోయింది. అందుకే నానో కారును డ్రైవింగ్ చేసే సమయంలో అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలని నానో వినియోగదారులు సలహా ఇస్తున్నారు. ఫలితంగా నానో కారు భద్రతపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.
గతంలో జరిగిన తొలి ప్రమాదాన్ని సాంకేతిక లోపంగా చిత్రీకరించారు. ఆ తర్వాత జరిగిన ప్రమాదాలకు ఇదే కారణాన్ని టాటా యాజమాన్యం చెప్పజాలదని వినియోగదారులు వాపోతున్నారు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో నానో కారును పూర్తిగా పరీక్షించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు.
ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి, భద్రతా ప్రమాణాలపై తనిఖీ చేయాలని వారు కోరుతున్నారు. అంతేకాకుండా, ఇప్పటి వరకు డెలివరీ చేసిన నానో కార్లను రీకాల్ చేసి పరీక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వినియోగదారులు కోరుతున్నారు.