పెండ్లి కుమార్తెల అందాలను పెంచే మేకప్స్

ప్రస్తుతం రాష్ట్రంలో పెండ్లిళ్ళ సీజన్ ప్రారంభమైంది. ముఖ్యంగా మహిళలు, పెండ్లి కుమార్తెలు తమ అందాన్ని మరింతగా పెంపొందించేందుకు బ్యూటీ పార్లర్‌లకు పరుగులు తీస్తుంటారు. మీ అందాన్ని మెరుగులు దిద్దేందుకు మేకప్ మరింత అవసరం. మేకప్ వేసుకునే ముందు కొన్ని చిట్కాలు మీ కోసం…

1.  ఐ మేకప్ వేసుకునే సమయంలో కళ్ళపై మాయిశ్చరైజర్ అప్లై చేయండి. దీంతో కళ్ళు మరింత అందంగా కనపడతాయి.

2.  ఐబ్రో షేప్ చేసేందుకు వార్మ్ చాకొలేట్, స్లేటీ, గ్రే లేదా నేవీ బ్లూ షేడ్‌లు కలిగిన ఐ పెన్సిల్ ఉపయోగించండి.

3.  ప్రస్తుతం వేసవికాలం కాబట్టి మీ పెదాలకు క్రీమీ లిప్స్టిక్ ఉపయోగించండి. దీనికి ప్లమ్, బర్గండీ, వైన్, కోరల్, బ్రాంజ్ షేడ్‌లు ఉపయోగిస్తే మీ అందమైన పెదాలకు మరింత అందం ఇనుమడిస్తుంది.

4.  స్కిన్ టోన్, డ్రెసప్‌ననుసరించి బ్లషర్ ఉపయోగించండి.

5.  వేసవి కాలంలో ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి లిక్విడ్ లేదా క్రీమ్ బేస్డ్ మేకప్ ఉపయోగించకండి. వాటర్‌ప్రూఫ్ మేకప్‌ను శుభ్రపరచాలంటే కాటన్ బాల్స్‌ ఉపయోగించండి.

అందమైన్, నాజూకైన చర్మసౌందర్యం కోసం!!

స్త్రీ అందానికి ప్రతి రూపం. ఆ అందం నాజూకైన చర్మంతో మరింత ఇనుమడిస్తుంది. చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉండటమే కాకుండా శుభ్రంగాను ఉంచుకునేందుకు ప్రయత్నించాల్సి వుంటుంది. కాని నేటి ఆధునిక కాలంలో చాలామంది మహిళలు, తమ చర్మసౌందర్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచలేక పోతున్నామని తెగ ఆందోళన పడుతుంటారు. అలాంటి వారు కాసింత సమయం కేటాయించి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి….

చర్మాన్ని రోజుకు 2-3సార్లు శుభ్రపరుస్తుండాలి. దీంతో ముఖంపైనున్న స్వేదగ్రంధులు శుభ్రమై మరింత నిగారింపును సంతరించుకుంటుంది. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని క్లీనర్స్‌తో శుభ్రపరచుకోండి.

ముఖంపై మొటిమలుంటే వాటిని గోళ్ళతో గిల్లకండి. రాత్రి పడుకునే ముందు క్రమం తప్పకుండా యాంటీ బ్లెమిశ్ సొల్యూషన్ లేదా యాంటీసెప్టిక్ క్రీమ్ వాడండి.

వయసుకు తగ్గట్టు ప్రత్యేక శ్రద్ధ :
ప్రతి మహిళ 25 సంవత్సరాల తర్వాత శరీర చర్మంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సివుంటుంది. చర్మంలో ప్రకృతిపరంగానున్న నిగారింపు తగ్గుతుంది. దీంతో అప్పుడే వయసు పైబడినట్లు చాలామంది ఆందోళన చెందుతుంటారు. దీనికి క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్‌ను వాడాలి. స్వేదరంద్రాలు శుభ్రంగా ఉండేందుకు ఎసంట్రజెంట్ లోషన్ ముఖానికి అప్లై చేస్తుండాలి. దీంతో చర్మం ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది.

నలభై సంవత్సరాల వయసు వచ్చే సరికి చర్మంలో నిగారింపు తగ్గడంతోపాటు చర్మంలో ఇదివరకున్న నూనె శాతం తగ్గిపోతుంది. దీంతో చర్మం పొడిబారినట్టు కనబడుతుంది. కాబట్టి ముఖాన్ని ఫేస్ వాష్‌తో శుభ్రపరుస్తు ఉండాలి. ఆ తర్వాత విటమిన్ ఈ‌తో కూడుకున్న క్రీమును ప్రతిరోజు ముఖానికి మాలిష్ చేయాల్సివుంటుంది. ప్రతి 15 రోజులకోసారి ఫేషియల్ చేయాల్సివుంటుంది. దీంతో చర్మం నిగారింపును సంతరించుకుని ఆరోగ్యంగా తయారవుతుంది.

యాభై సంవత్సరాల తర్వాత చర్మంలో పటుత్వం కోల్పోతుంది. దీంతో చర్మంపై ముడతలు ఏర్పడటం ప్రారంభమౌతుంది. కాబట్టి చర్మాన్ని క్లీజింగ్ జెల్‌తో శుభ్రపరుస్తూవుండాలి. నియమానుసారం టోనింగ్‌తోపాటు చర్మంపై క్రీముతో మాలిష్ చేస్తుండాలి.

ఆయిల్ థెరపీః
నెలకు ఒకసారి ఆయిల్ థెరపీ చేసుకోవాలి. ఆయిల్ థెరపీ కొరకు 2 చెంచాల బాదం నూనె, 2 చెంచాల కొబ్బరి నూనెను కలుపుకుని వేడి చేసుకోవాలి. పత్తితో మీ మూఖాకృతిని తయారు చేసుకోండి. గోరువెచ్చగావున్న ఈ మిశ్రమాన్ని ముఖాకృతిని తయారు చేసుకున్న పత్తిని తడపండి. నూనెలో తడిపిన పత్తిని ముఖంపై మెల్లగా పెట్టుకోండి. పత్తి చల్లగా తయారయ్యేంత వరకు మీ ముఖంపై అలాగే ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటిలో ముంచిన పత్తిని ముఖంపై ఉంచండి. దీంతో మీ ముఖారవిందం మరింత నిగారింపును తెస్తుందనడంలో సందేహం లేదు.

విపరీతమేన ఎండలో తిరిగితే చర్మానికి చాలా ప్రమాదం. కాబట్టి మీ శరీర చర్మాన్ని ఎండ నుంచి కాపాడుకునేందుకు సన్ స్క్రీన్ లోషన్‌ను పూయండి. చర్మంలో నాజూకుదనంతోపాటు నిగారింపు ఉంటుంది.

మీ చర్మపు నునుపుదనం తగ్గిపోతుందా

ఒక టీస్పూన్ తేనెకు గుడ్డులోని తెల్లసొన, గ్లిజరిన్‌ రెండు టీస్పూన్ల చొప్పున కలిపి.. చివరగా దానికి శెనగపిండి చేర్చి బాగా కలపాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌ వేసుకున్న పదిహేను నిమిషాల తర్వాత తొలగించి శుభ్రం చేసుకోవాలి. అలాగే గుడ్డులోని తెల్లసొనను ముఖానికి పట్టించండి. ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేస్తే.. వదులైన చర్మం గట్టిపడి, మృదువుగా మారుతుంది. అరకప్పు పుల్లటి పెరుగును చర్మానికి రాసుకుని మర్దనా చేయండి. ఇరవై నిమిషాల తరువాత వేడినీటితో కడిగేయాలి.

ఇలా చేస్తే ముఖం కోల్పోయిన తేమను పొందుతుంది. పొడిబారిన చర్మతత్వానికి ఇది చక్కగా పనిచేస్తుంది. తేనె రాసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. తేనె చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. అరకప్పు ద్రాక్షపండ్ల గుజ్జుకు మూడు టీస్పూన్ల నిమ్మరసం, ఒక టీస్పూన్ యాపిల్‌గుజ్జు, పావు కప్పు గుడ్డులోని తెల్లసొన కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

ఈ ప్యాక్‌ జిడ్డుచర్మతత్వానికి చక్కగా పనిచేస్తుంది. అలాగే గింజల్లేని టమోటా గుజ్జు పావు కప్పు, కీరదోస గుజ్జు ఒక టీస్పూన్, ఓట్‌మీల్‌ పొడి 4 టీస్పూన్లు, పుదీనా మిశ్రమం ఒక టీస్పూన్ తీసుకుని బాగా కలిపి ప్యాక్‌ వేసినా ఫలితం ఉంటుంది. ఇలా చేస్తే చర్మంపై ఉండే జిడ్డు తొలగిపోయి కాంతివంతం అవుతుంది.

ఇంట్లో ఉండే “పెరుగు” పెంచుతుంది మీ సౌందర్యాన్ని!!

ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకునే పెరుగు, మజ్జిగలో ఎన్నో రకాల పోషక విలువలు దాగున్నాయి. అవి ఆరోగ్యంతోపాటు అందాన్నికూడా ఇస్తాయి. అందుకనే పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఓ 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగితే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతివంతం అవుతాయి.

తలస్నానం చేసేందుకు ఓ గంట ముందుగా తలకు పెరుగును బాగా పట్టించి తలస్నానం చేసినట్లయితే.. మళ్లీ విడిగా కండీషనర్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. అలాగే పెరుగులో తేనెను కలిపి పూసినా చక్కని కండీషనర్‌లా ఉపయోగపడుతుంది. పెరుగులో శనగపిండిని కలిపి, నలుగుపిండిలా శరీరానికి పట్టిస్తే.. చర్మం, ముఖం మీదనున్న మృతకణాలు తొలగిపోతాయి.

ముల్తానీ మట్టిలో పెరుగును కలిపి, శరీరమంతటా అప్లై చేస్తే అది క్లెన్సింగ్ ఏజెంటులా పనిచేస్తుంది. పెరుగులో కాస్తంత చక్కెరగానీ లేదా ఉప్మా రవ్వగానీ వేసి బాగా కలిపి.. ముఖానికి పట్టించి మసాజ్ చేస్తే డెడ్ స్కిన్ తొలగిపోతుంది. పెరుగులో కాస్త పచ్చి పసుపును వేసి కళ్లచుట్టూ ఉండే నల్లటి వలయాలపై రాస్తే నలుపుదనం తగ్గుతుంది. ఎండలోంచి నీడలోకి వెళ్లగానే పెరుగులో ఐస్‌క్యూబ్‌లు వేసి ఆ మిశ్రమంతో ముఖానికి మసాజ్ చేస్తే ఎండకు కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది.

వేసవిలో తిరగడం వల్ల చర్మం కమిలిపోతుందా!

అబ్బా ఈ ఎండల్లో తిరిగి తిరిగి చర్మం కమిలిపోతోందమ్మా. అందరి సమస్యా ఇదే ఎండాకాలంలో. పనుల రీత్యా బయటకు తిరగడం తప్పనిసరి. కాలు బయట పెట్టిన క్షణం నుంచే సూర్యకిరణాల దాడి మొదలౌతుంది. ఈ మధ్య కాలంలో వేడి ఎంతగా పెరిగిపోయిందంటే సూర్యకిరణాలు చేతిపై, కాలిపై పడుతుంటే వేడైన, వాడైన సూదులతో గుచ్చుతున్న అనుభూతి కలుగుతోంది. ఇలాంటి ఎండల వల్ల చర్మం నల్లగా మారి కాంతిహీన మవ్వడమే కాకుండా, సహజమైన తేమను కోల్పోయి వికారంగా తయారు అవుతుంది.

ఎన్నో క్రీములు, లోషన్లు, సన్‌ప్రొటెక్టర్లు వాడినా లాభం శూన్యం.అతినీలలోహిత కిరణాలు చర్మంలోకి చొచ్చుకుపోయి చేయాల్సిన హాని చేసేస్తుంటాయి. అందుకే ఈ ప్రభావం నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేయాల్సిందే. ఎండలో వెళ్లేటప్పుడు గొడుగు తీసుకువెళ్లడం, బైక్‌పై ప్రయాణించేవారు హెల్మెట్‌, గ్లౌసెస్‌ ధరించడం వంటి సాధారణ జాగ్రత్తలు తప్పని సరిగా పాటిస్తూనే ఎండ తాపానికి గురైన చర్మానికి చికిత్సను కూడా తీసుకోవాలి. అది ఎలాగో చూడండి.

ఎండలోనించి రాగానే పదినిమిషాలు శరీరానికి విశ్రాంతినివ్వండి. ఆ తరువాత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోండి. శెనగపిండిలో కాస్త గంధం పొడి కలిపి ఎండ ద్వారా బాధింపబడ్డ ముఖం, చేతులు, పాదా లపై అప్లై చేసి, పావుగంట తరువాత చల్లని నీటితో కడిగేయండి.శెనగపిండి పేరుకున్న మురికిని తొలగిస్తే గంధం చర్మానికి చల్లదనాన్ని ఇస్తూ కోల్పోయిన మెరుపు తిరిగి సంతరించుకునేలా చేస్తుంది. రోజూ వంట సమయంలో టమాటాలు, బంగాళ దుంప, కీర, దోస, బీట్‌రూట్‌ వంటి కూర గాయలు తరుగుతుంటాం కదా.  అలా తరిగే టప్పుడే రెండు ముక్కలను తీసుకుని ముఖానికి, చేతులకు, మోచేతులకూ రుద్దండి. బాగా ఆరాక సబ్బులేకుండా నీళ్లతో శుభ్రంగా కడుక్కోండి.  ఈ కూరగాయల్లో సహజంగా ఉండే నీరు చర్మాన్ని తేమగా ఉంచేందుకు సహకరిస్తుంది. చర్మం మృదువుగా అయ్యేలా చేస్తుంది.

పాలమీగడలో గంధం కలిపి ఎండకు వాడిన చర్మంపై రాసి అరగంట తరువాత సబ్బుతో ముఖాన్ని కడిగితే కమిలిన చర్మం తిరిగి మామూలుగా మారుతుంది. ఇది కమలాల సీజన్‌. తాజా కమలా తొక్కను మిక్సీలో పేస్ట్‌ చేసి ముఖానికి చేతులకూ రాసి చల్లటి నీటిలో కడిగేసినా మంచి ఫలితం ఉంటుంది. ఎండల్లో చర్మాన్ని చల్లబరిచే ఏకైక సాధనం గంధం. వీలైతే గంధపు చెక్కను అరగదీయగా వచ్చిన గంధాన్ని ముఖానికి లేపనంగా పూసుకోవడం అన్నిటికన్నా ఉత్తమం.  రసం తీసేసిన నిమ్మ చెక్కపై ఉప్పు లేదా పంచ దార వేసి అది కరిగే వరకూ మెడ, ముఖం, చేతులపై రుద్దితే ఎండ ప్రభావానికి లోనైన చర్మం తిరిగి ఉత్తేజితం అవుతుంది.

యాపిల్‌, బొప్పాయి, కమలా పండ్ల గుజ్జుతో ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే సహజమైన క్లెంజిగ్‌లా పనికొస్తాయి. చర్మానికి నిగారింపును ఇస్తాయి.ఎండలో తిరిగి వచ్చిన వెంటనే చర్మం అంతా కాలుతున్న అనుభూతికి లోనౌతుంటుంది. అలాంటప్పుడు చెంచాడు తేనె తీసుకుని వేడి అనిపిస్తున్న ప్రాంతంపై సున్నితంగా అప్లై చేయండి. కాసేపు ఆరాక కడిగేయండి. ఇలాం టప్పుడు గంధం కూడా ఉపయోగించవచ్చు. వీటితోపాటు మంచినీళ్లు, కొబ్బరినీళ్లు, బార్లీ, సబ్జానీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. శరీరంలో గ్లూకోజ్‌ శాతం తగ్గకుండా చూసుకోవాలి.సీజనల్‌ పండ్లు తీసుకోవాలి. ఆహారం విష యంలో జాగ్రత్తలు తీసుకోవాలి.చూసారుగా మన ఇంట్లోనే ఎండతాకిడి నుండి చర్మాన్ని కాపాడే రక్షణ  కవచాలు ఎన్ని ఉన్నాయో. రసాయనాలతో నిండిన ఇతర ప్రోడక్ట్‌ల కన్నా ఇవి ఎంతో మేలైనవి. హాని చేయనివి. ఈ రోజే మీరు ప్రయత్నిస్తున్నారా!

పాదాల పగుళ్ళ నివారణ

పాదాల పగుళ్ళు సాదారణము గా పొడి చర్మము ఉన్న వాళ్ళకి , మధుమేహ వ్యాధి గల వారికి ఎక్కువగా బాధపెడతాయి .

కారణాలు :

* శరీరములో అధిక వేడి ,
* పొడి చర్మము ,
* ఎక్కువ సేపు నిలబడి పనిచేయువారికి ,
* కటిన నేలపై నడవడం ,
* ఎత్తైన చెప్పులు ధరించి నడవడం ,
* అధిక బరువు కలిగిఉండడం ,
* పోషకాహార లోపము ,
* మధుమేహ వ్యాది ,

పరిష్కార మార్గాలు >

* రొజూ నిద్రించటానికి ముందు కాళ్ళను శుభ్రపరుచుకుని తడుచుకోవాలి .
* పగుల్లపై కొబ్బరి నునే తో మృదువుగా మర్దన చేసి మందం గా ఉండే సాక్సులు ధరించాలి .
* ప్రతిరోజూ ఉదయం పాత బ్రష్ తో రుద్ది గోరువెచ్చని నీటిలో కడిగితే మురికి , మ్రుతకనలు పోయి నున్నగా తయారవుతాయి .
* అరటిపండును ముద్దగా చేసుకొని పగుళ్ళ పై రాసి పదినిముసాలు వుంచి తరువాత నీటితో శుభ్రపరచుకుంటే పాదాలు మెట్టబడతాయి .
* గోరువెచ్చని నీటిలో కొంచెము నిమ్మరసం వేసి అందులో పదాలను వుంచి పది నిముషాలు తరువాత మామూలు నీటితో శుభ్రపరచుకునే పగుళ్ళ ఉండే నొప్పి తగ్గుతుంది .
* ప్రతి రోజు సాయంత్రం రోజ్ వాటర్ ను పళ్ళెం లో వేసి పది నిముషాలు పాదాలు ముంచి ఉంచితే మృదువు గా తయారవుతాయి .
* నిమ్మరసము వ్యాజ్ లైన్ వేసిన గోఫువేచ్చని సబ్బుద్రావనం లో పాదాలను పెట్టి 10 నిముషాలు అయ్యాక పొడి వస్త్రం తో తుడిచి నాణ్యమైన మాయిశ్చరైజర్ రాయాలి .
* ఉదయం ఆవన్ర్న్ర్ తో కాళ్ళను మర్దన చేసుకుంటే పగుళ్ళు మెత్తబడి కొద్దిరోజులకు తగ్గిపోతాయి .
* రోజు మంచి పోషకాహారము తీసుకోవాలి .

మల్లెలు గుభాళింపులకే కాదు.. ఆరోగ్యానికి కూడా.

స్త్రీలు సౌందర్య సాధనంగా ఉపయోగించే మల్లెపూలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం…
రోజంతా అలసిపోయిన కనులపై మల్లెలను కొద్దిసేపు ఉంచినట్లయితే చలవనిస్తాయి. తలలో చుండ్రు సమస్య అధికంగా ఉంటే మెంతులతోపాటు కాసిన్ని ఎండుమల్లె పూలు కలిపి నూరి తయారైన చూర్ణాన్ని తలకు పట్టిస్తే చుండ్ర సమస్య తగ్గడమే కాక జుట్టు కూడా పట్టు కుచ్చులా మెరిసిపోతుంది.

కొబ్బరి నూనెలో మల్లెపూలు వేసి ఓ రాత్రంతా బాగా నానబెట్టి ఆ తర్వాత బాగా మరగబెట్టి తలకు పట్టిస్తే కేశాలు ఆరోగ్యవంతమవడమే కాక మాడుకు చల్లదనాన్నిస్తుంది.

మల్లె పువ్వులను ఫేస్ ప్యాక్‌గా కూడా వాడుకోవచ్చు. మల్లెల్ని పేస్టుగా చేసి కొద్దిగా పాలు కలిపి, నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముల్తానామట్టి, గంధం, తేనె అరస్పూన్ చొప్పున కలిపి ప్యాక్ వేసుకోవాలి.

మల్లెపూల రసం తీసి గులాబీ పువ్వుల రసం, గుడ్డులోని పచ్చ సొన రెండేసి స్పూన్ల చొప్పున కలిపి ముఖానికి రాస్తే ముఖం మృదువుగా కాంతివంతంగా మెరిసిపోతుంది. మల్లెపూలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల పలు ఔషధాలలో మల్లెపూలను వాడుతున్నారు.

బిజీగా ఉన్న వారికి రిలాక్సేషన్ పేస్ ప్యాక్

దైనందిన కార్యకలాపాల్లో బిజీ బిజీగా గడిపే మగువలు రిలాక్సేషన్ కావాలనుకుంటే.. దాల్చినచెక్కతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే, హాయిగా ఉండటమేగాక అందం మరింత ద్విగుణీకృతం అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్‌కు కావల్సిన పదార్థాలేంటంటే.. దాల్చినచెక్క పొడి.. పావు టీస్పూన్, చిన్న కీరా.. ఒకటి, పెసర పిండి.. రెండు టీస్పూన్లు.

కీరాను ముక్కలుగా చేసి మిక్సీలో వేసి పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో పెసరపిండిని వేసి బాగా కలియబెట్టాలి. చివరగా దాల్చిన చెక్క పొడిని వేసి కలపాలి. చన్నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత పేస్ట్ చేసిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. అలాగే గుండ్రంగా కట్ చేసిన రెండు కీరా ముక్కలను కళ్లపైన ఉంచి అరగంటసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఈ ప్యాక్ రాత్రిపూట వేసుకుంటే ఉదయపు బడలిక అంతా మటుమాయమై రిలాక్సేషన్‌తోపాటు చర్మకాంతి కూడా పెరుగుతుంది.

ద్రాక్ష పండు సౌoదర్యానికి ఎంతో మేలు

ద్రాక్ష  ఒక రకమైన పండ్ల చెట్టు. ఇది పుష్పించే మొక్కలైన వైటేసి కుటుంబంలోని వైటిస్ ప్రజాతికి చెందినది. ద్రాక్షలో ఇంచుమించు 60 జాతులున్నాయి. ఇవి ఎక్కువగా ఉత్తరార్ధ గోళంలో ఎక్కువగా పెరుగుతాయి. ద్రాక్ష పండ్లను అలాగే తినవచ్చును లేదా వాటి నుండి పానీయాలు, సలాడ్లు, మరియు వైన్ తయారుచేయవచ్చును. ద్రాక్ష తోటల పెంపకాన్ని ‘వైటికల్చర్’ అంటారు.

ద్రాక్ష… పేరు వింటేనే తినాలనిపిస్తుంది. అంతటితో ఆగితే ఎలా! వాటి వల్ల ఆరోగ్యానికి… సౌందర్యానికి ఎంత మేలో తెలుసుకోవద్దూ!

ఆరోగ్యం
* ద్రాక్ష పండ్లలోని టన్నీస్‌, పాలిఫినాల్స్‌ క్యాన్సర్‌ సంబంధిత కారకాలపై పోరాడుతాయి. శరీరంలో కొవ్వు స్థాయిని తగ్గిస్తాయి.

* ఇందులో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. అంతేకాదు.. రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా సాయపడుతూ గుండె కవాటాల పనితీరును మెరుగుపరుస్తాయి.

* ద్రాక్ష గింజల్లో ఉండే ప్రొనాంథోసైనిడిన్‌ అనే పదార్థం కాలేయాన్ని సంరక్షిస్తుంది. పెద్దవయసు వారిలో సహజంగా తలెత్తే దృష్టి లోపాన్ని నియంత్రించి కంటిచూపును మెరుగుపరుస్తుంది.

* తలనొప్పితో బాధపడేవారికి ద్రాక్షలోని సుగుణాలతో ఉపశమనం లభిస్తుంది

సౌందర్యం
* ద్రాక్ష పండ్లలోని పాలిఫినాల్స్‌ శరీరంలో కొల్లాజిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. మేనిని కాంతిమంతం చేస్తుంది.

* వీటిల్లోని పైటోకెమికల్స్‌ కణాల క్షీణతను తగ్గించటంతో పాటు శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించి వేస్తాయి.

* జీవం కోల్పోయిన జుట్టుకు ద్రాక్ష గింజలు చక్కని ఔషధంలా పనిచేస్తాయి. వాటిల్లోని ఫ్యాటీ ఆమ్లాలు శిరోజాలకు పోషణను అందించి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. దాంతో శిరోజాలకు మంచి నిగారింపు వస్తుంది.

* చర్మ సంరక్షణకు ద్రాక్ష పండ్లు ఎంతగానో ఉపకరిస్తాయి. అందుకే వీటిని స్క్రబ్‌, మాయిశ్చరైజర్‌ తయారీలో ఉపయోగిస్తున్నారు. తాజా ద్రాక్షలను గుజ్జులా చేసి మసాజ్‌ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

ఉపయోగాలున్నాయని అతిగా తినడం, సౌందర్య పోషణకు వినియోగించడం మంచిది కాదు. తగిన మోతాదు వాడకంతోనే అన్ని విధాలా ఆనందం.

తెల్లద్రాక్ష, నల్లద్రాక్ష… రంగేదైనా కానివ్వండి. తినడానికి రుచిగా ఉండటమే కాదు సౌందర్యపోషణలోనూ కీలకపాత్ర పోషిస్తాయి. ద్రాక్షపండ్లు సహజక్లెన్సర్లుగా పనిచేసి చర్మంపై ఉండే మురికిని పోగొడతాయి కాబట్టి సౌందర్యనిపుణులు వీటిని చర్మసంరక్షణలో భాగంగా అనేక రకాలుగా ఉపయోగిస్తారు.

* ఎండల్లో ఎక్కువగా తిరిగితే ముఖం వాడిపోయినట్టవుతుంది. అలాంటి సమయంలో ఒక కప్పు తెల్లద్రాక్ష తీసుకుని వాటిని మెత్తగా చిదిపేసి ఆ గుజ్జులో టేబుల్‌స్పూన్‌ తేనె వేసి బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగెయ్యండి. మురికి పోయి ముఖం తేటగా అవుతుంది.
* సైజులో పెద్దగా ఉండే గింజలేని తెల్లద్రాక్షను తీసుకుని సగానికి కొయ్యండి. ఆ ముక్కతో ముఖమంతా సున్నితంగా రాయండి. కళ్లకిందా పెదవుల చివర… ఇలా ముడతలు పడటానికి ఎక్కువ అవకాశం ఉండే ప్రదేశాల్లో ఇంకొంచెం ఎక్కువ సేపు రాయాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుని పొడిగుడ్డతో తుడుచుకోవాలి. వయసు పెరగడం వల్ల వచ్చే ముడతల్ని సమర్థంగా నిరోధిస్తాయి.
* రెండు చెంచాల ద్రాక్షరసానికి ఒక టేబుల్‌స్పూన్‌ చొప్పున పెరుగు, తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రుద్దండి. పావుగంట తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగెయ్యండి. ఈ మాస్క్‌ ముఖచర్మాన్ని శుభ్రపరచి మృదువుగా ఉంచుతుంది.
* ఒక టేబుల్‌స్పూన్‌ ద్రాక్ష రసంలో గుడ్డులోని పచ్చసొన బాగా కలిపి ముఖానికి రాయండి. పదినిమిషాల తర్వాత చల్లటినీళ్లతో కడుక్కోండి. పొడిచర్మం గలవారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. అదే, మీది జిడ్డు చర్మమైతే పచ్చసొన స్థానంలో తెల్లసొన వాడితే సరిపోతుంది.