ముక్కుపుడక

ముక్కుపుడక లేదా ముక్కెర ఒక విధమైన ముక్కుకు ధరించే ఆభరణము. ముక్కుపుడక ధరించడం సంపంగిలాంటి ముక్కుకు కొత్త వింత అందాన్ని ఇస్తుంది. దీనిని ఎక్కువగా స్త్రీలు ధరిస్తారు. అనేక ప్రాంతాలలో ముక్కుపుడక పెళ్ళి అలంకారాలలోనే ఎక్కువగా కనిపిస్తుంది.
ముక్కెరను తమిళంలో ముక్కుట్టి, హిందీలో నాత్ లేదా నాథురి, బీహారీలో లాంగ్ అని పిలుస్తారు.
పురాణాలు:
ముక్కుపుడక అంటే మహిళలకు ఎంత మక్కువో తెలియాలంటే పురాణాలలోని ఎన్నో ఉదాహరణలు ఇవ్వచ్చు. భామాకలాపంలో ఒకసారి సత్యభామ చెలికత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయబారం కోసం వెళ్ళమంటుంది. ఎన్ని లంచాలు ఇస్తానన్నా, ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్లనంటుంది. విసిగిన సత్య చివరకు అసలు నీకేం కావాలో చెప్పవే అని అడిగితే సత్యభామ ముక్కున ఉన్న ముక్కెర కావాలంటుంది. అది ఇవ్వగానే లంకెబెందెలు దొరికినంత సంతోషమ్గో శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి రాయబారం నడుపుతుంది.
హిందూ దేవతలు అందరికీ ముక్కెర తప్పకుండా ఉంటుంది. బెజవాడ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కెరను తాకితే భూమి మీద ఎవ్వరూ మిగలరని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు కాలజ్ఞానంలో చెబుతారు.
సాంప్రదాయం:
అలంకారంగా స్థిరపడిన ముక్కెరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహూకరించడం అనేది ప్రాచీన కాలంనుంచీ వస్తున్న సాంప్రదాయం. బయటి వాళ్ళెవరైనా ఇవ్వజూపితే అది చాలా తప్పు. ఒకవేళ వాళ్ళనుంచి తీసుకున్నారు అంటే వాళ్ళు దేవదాసీలై ఉంటారు. ఎందుకంటే ఇది భర్త ప్రేమకు గుర్తు. అందుకే ‘మగని ప్రేమకే గుర్తు మగువ ముక్కుపుడక’ అన్నాడో కవి. తాళిబొట్టు మాదిరిగానే వివాహసమయంలో ధరించిన ముక్కుపుడకను జీవితాంతం తీయరు కొందరు. అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం. అందుకే దీన్ని సౌభాగ్యానికి సంకేతంగా చెబుతారు.
భార్య పెట్టుకున్న ముక్కుపుడక బరువు, సైజు, డిజైన్ భర్త ఆర్థిక స్తోమతను తెలిపేవిగా ఉండేవి. రాజుల వంశానికి చెందిన మహిళల ఆభరణాల్లో ఒకటి నుండి 17 వరకు వివిధ రత్నాలు ఉన్న ముక్కుపుడకలు ఎన్నో ఉండేవి.
పూర్వకాలంలో ఏడేళ్ళ వయసులోనే ముక్కు కుట్టించి బంగారుతీగ చుట్టించేవారు. పెరిగిన తర్వాత దాన్ని తీసి రాళ్ళు పొదిగిన పుడకలు పెట్టేవారు. ఎంత పేదవారైనా దీనిని మాత్రం బంగారంతోనే చేయించుకుంటారు. దక్షిణ భారతదేశంలో దీన్ని ఎక్కువగా కుడివైపు పెడితే, ఉత్తరాదిన మాత్రం ఎడమవైపు పెడుతుంటారు. ఈ ప్రస్తుతకాలంలో కూడా పెద్ద ముత్యపు ముక్కెరను మరాఠీ మహిళలు చాలా ఇష్టంగా ధరిస్తారు. కొందరిలో ఇది దాదాపు గడ్డం వరకు వస్తుంది. ఇప్పటికీ కొందరు ఆదివాసులలో పెద్దవైన బులాకీలు వాడతారు.
అధునిక ఫ్యాషన్:
ఇప్పుడు పెళ్ళికాని అమ్మాయిలు కూడా ముక్కెరను ఇష్టంగా ధరిస్తున్నారు. బంగారు పుడక నుంచి వజ్రపు ముక్కుపుడక వరకూ, రింగులు కూడా ధరించడం ఫ్యాషన్ గా మారింది. దానితో సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకూ అందరూ దీనిని ఇష్టంగా ధరిస్తున్నారు. ప్రముఖ క్రీడాకారిణి సానియా మిర్జా దీనిని మార్చకుండా ధరిస్తుంది. ప్రపంచ సుందరి పోటీల్లో వజ్రపు ముక్కుపుడకతో ఐశ్వర్యా రాయ్ అందరినీ ముగ్ధుల్నిచేసింది.

ఆడవాళ్ళ చేతికి గాజులే అందం

ఆడపిల్ల అందాన్ని వర్ణించేటప్పుడు తామర తూడుల్లాంటి చేతులకు ముత్యాల గాజులు, బంగారు కడియాలు అంటూ చెబుతారు. అవును మరి వయ్యారాలొలికే నెలతకు సొగసైన చేతులు, వాటికి సౌందర్యాన్ని ఇనుమడింపజేసే గాజులు అవసరమే కదా! ఒకప్పుడు చేతినిండా మట్టిగాజులు లేదా బంగారు గాజులను వేసుకునే వారు.

క్రమేపీ వివిధ రకాల మెటీరియల్స్‌తో తయారైన గాజులను ధరిస్తున్నారిప్పుడు. మెటల్‌, చెక్క, దంతం, ప్లాస్టిక్‌ ఇలా  ఎన్నోవెరైటీలు. కాళ్లకు తొడిగే గజ్జెలు మాత్రమే ఘల్లుమనాలా? ముంజేతులకు రతనాల గాజులు కూడా ఘల్లుమంటూ గుండె ఝల్లుమనిపిస్తాయి అంటూ అమ్మాయిలు మువ్వల గాజులను ధరిస్తున్నారు.

సెట్‌గా లభించే ఈమెటల్‌ గాజులను చూడండి. వేళ్లాడే మువ్వలతోచూడముచ్చటగా ఉన్నాయి కదూ! గోల్డ్‌ సిల్వర్‌ కలర్‌లో లభించే ఈ సెట్‌లను ఎక్కువగా పార్టీవేర్‌ యాక్ససరీస్‌లో వాడుతుంటారు. ట్రెడిషన్‌ డ్రెస్‌లపై బాగా సూటౌతాయివి. లంగా ఓణీలపైన, చీరలకు, పట్టు చుడీదార్‌లపై వీటిని వేసుకోవడం ఇప్పుడు లేటెస్ట్‌ ఫ్యాషన్‌గా చెబుతారు.ఇంకేం మీ చేతులకు కూడా వీటిని సింగారించుకుని మురిసిపోయేందుకు సిద్ధమవ్వండి.

కాలి అందియలు…..!

కాలి అందియలు ఘల్లుఘల్లుమన రాజహంసలా రావే…. అంటూ పాత తెలుగు పాటలో కాలిఅందెల గొప్పతనాన్ని మరపురాని రీతిలో వర్ణించారు. గజ్జె ఘల్లుమంటుంటే… గుండె జల్లుమంటుంది అంటూ కాలి గజ్జెలు చేసే చిరు సవ్వడి గురించి మరో తెలుగు సినీ కవి పలవరించడం కూడా మనకు తెలుసు.

అందియలు.. పట్టీలు.. గజ్జెలు.. మువ్వలు ఇలా ఏ పేరుతో పిలిస్తేనేం…. భారతీయ కుటుంబాల్లో కాలి అందెలకు లేక పట్టీలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మహిళలందరూ ఇష్టపడే ఆభరణాల్లో కాలి అందెలకు కూడా చోటుంది. మన తెలుగు లోగిళ్లలో ఆడపిల్లలు ఉన్నవిషయం కూడా ఈ కాలి పట్టీల వల్లే తెలిసేదంటే ఆశ్చర్యపడనవసరం లేదు.

కాలి మువ్వల గలగలలు వినిపించని, అందెల రవళులు సోకని కుటుంబాలను ఒకప్పుడు మనం ఊహించి ఉండం. పిల్లలూ, పెద్దలూ పోటీ పడి ఒకప్పుడు అందెలు పెట్టుకునేవారు. అయితే మారిన అభిరుచుల మేరకు అందెలు పెట్టుకోవడం బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఆడపిల్లలెవరూ పాఠశాలకు పట్టీలు పెట్టుకుని పోవడం లేదు.
సవ్వడి చేయని అందెలు..
ఇంతవరకు తెలుగు లోగిళ్లను మురిపించిన అందాల కాలి మువ్వలు శబ్ద సౌందర్యానికి దూరమయ్యే రోజులు వచ్చేశాయి. ఎవరు ఔనన్నా, కాదన్నా ఇప్పుడు ఫ్యాషన్లదే రాజ్యం. కాబట్టే గజ్జెల సవ్వడిలోని మంత్రనాదాలకు ఇప్పుడు కాలం చెల్లుతూందేమో.. మువ్వల సవ్వడి లేని కాలమిది…

కొన్ని ప్రయివేటు పాఠశాలల్లో అయితే కాలి పట్టీలను పెట్టుకునే వీలులేకుండా నిషేధించారు. పైగా అది చేసే శబ్దానికో లేక ఫ్యాషన్ కాదనే ఫీలింగుతోటో చాలామంది ఆడపిల్లలు పాఠశాల రోజుల్లో వీటిని పెట్టుకోవటం లేదు. అయితే కాలేజీకి వెళ్లేటప్పుడు యువతులు పెట్టుకోవడానికి వీలుగా ఆకర్షణీయమైన పట్టీలు వచ్చేశాయి. అవి ఏవంటే సవ్వడి చేయని పట్టీలు.

ఘల్లుఘల్లుమనని మువ్వలు..
ఇదివరకు పట్టీలు వెండితో తయారు చేసి గజ్జెలతో నిండుగా ఉండేవి. కాళ్లకు నిండుగా పట్టే ఈ చిరుమువ్వలు నిశ్శబ్ద వాతావరణంలో మంత్రనాదంలా మోగుతూ అందరి దృష్టినీ ఆకర్షించేవి. అయితే ఇప్పుడు కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు అలాంటి పూర్ణ పట్టీలను ఇష్టపడటంలేదు. పాత కాలపు మువ్వలు ఆధునిక వస్త్రధారణకు అనుకూలంగా లేవని భావించేవారి కోసం కొత్త పట్టీలు వచ్చాయి. ఇవి శబ్దం చేసేవి కాకపోవడమే విశేషం.

ఆధునిక విద్యార్థినులు, యువతుల కోసం శబ్దం చేయని పట్టీలు ఇప్పడు మార్కెట్లోకి వచ్చాయి. కాలికి రెండు వరుసలు పెట్టుకుని దాని కొసను కాలివేలికి తగిలించుకుని ఉండే రకం పట్టీలు వచ్చాయి. వీటిని లంగా, వోణీలమీద వేసుకోవడానికి తయారు చేయలేదు మరి. తాజా ఫ్యాషన్ దుస్తులపై హైహీల్స్ వేసుకున్నప్పుడు పెట్టుకోడానికి శబ్దంలేని పట్టీలు వచ్చేశాయి.

ఇలాంటి వాటిని డ్రస్‌కు మ్యాచింగ్‌గా కూడా పెట్టుకోవచ్చు. రెండు వరుసల పూసల పట్టీలు, నీలంరాళ్లు పొదిగిన పట్టీలు, గొలుసు మోడల్‌లో ఉన్న పట్టీలు, మెటల్‌తో చేసిన పట్టీలు ఇలా ఎన్ని రకాలుగా ఉన్నా ఇవన్నీ శబ్దం లేదా సవ్వడి చేయని నిశ్శబ్ద పట్టీలు కావడం విశేషం.

మువ్వల సౌందర్యం అంతా గజ్జె ఘల్లుమనడంలో ఉందనుకుంటే ఇప్పటి తరం అందుకు అంగీకరించడం లేదు. సింపుల్‌గా ఉండటమంటే నిశ్శబ్దంగా ఉండటం అని కూడా అర్థం మారిపోయిన రోజుల్లో కాలి అందెలు కూడా ‘సాఫ్ట్ సంస్కృతి.ని అలవర్చుకున్నాయి. ఎవరయినా కాలం మార్పును అంగీకరించాల్సిందే కదా.. అందుకే గజ్జె ఘల్లుమనని నూతన ధోరణులను కూడా ఆహ్వానిద్దాం మరి….

తిలకాలకు బాయ్ బాయ్.

పురాతన కాలంగా వస్తున్న భారతీయ సాంప్రదాయాల్లో తిలకధారణ ఒకటి. ఆలనాటి మహిళలు నుదుటన తిలకాన్ని దిద్దుకునేవారు. నేటి ఆధునిక యుగంలో తిలకధారణ స్థానంలో స్టిక్కర్లు చోటుచేసుకున్నాయి.
పలు రకాలుగా అందుబాటులో ఉన్న స్టిక్కర్లు నేటి యువతరాన్ని పెద్దఎత్తున ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం స్టిక్కర్లు ప్లాస్టీక్‌లో మాత్రమే కాకుండా ప్లాటినం, బంగారు, వెండి వంటి ఖరీధైన వస్తువులతో తయారవుతున్నాయి. ఆధునిక యువతలు అధికంగా వాడేవి మెరిసే స్టోన్స్ పొదిగిన స్టిక్కర్లే.
రంగు రంగుల స్టోన్స్ పొదిగిన స్టిక్కర్లలో వంగ పూత, నెమలి, పాము, హంస అంటూ తదితర ఆకృతులలో మిలమిలమెరిసే స్టిక్కర్ బొట్లు మార్కెట్‌లో విరివిగా లభ్యమవుతున్నాయి. రాత్రి పూట పార్టీలకు వెళ్ళే స్త్రీలు చెమ్కీలు, చిన్న చిన్న గజ్జెలు పొదిగిన స్టిక్కర్లను పెట్టుకునేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు.

స్లీవ్‌‌ లెస్‌ …. స్లీవ్‌‌ లెస్‌!

మహిళలూ… మీలోని ఆధునికతను బయటపెట్టే వస్త్ర ధారణలో ఒకటి స్లీవ్‌‌లెస్‌.
ఎప్పుడు నప్పుతుంది ? చీర, జీన్స్, నైటీ, సూట్‌ … వీటన్నింటికీ టాప్‌గా స్లీవ్‌‌లెస్‌ నప్పుతుంది. ముఖ్యంగా మీరు సన్నగా, పొడుగ్గా ఉన్న వారైతే మీ భుజాలు, చేతుల అందం స్లీవ్‌లెస్‌తో రెట్టింపు అవుతుంది. ప్లెయిన్‌ లేదా ప్రింటెడ్‌ చీరలు ధరించే వారు స్లీవ్‌లెస్‌ ధరిస్తే అందం మరింత ద్విగుణీకృతమవుతుంది. జీన్స్‌తో పాటు స్లీవ్‌లెస్‌ టాప్‌ ధరిస్తే మీ అందం రెట్టింపు అవుతుంది.

స్లీవ్‌ లెస్‌ ధరించాలంటే…
1. చేతులు, భుజాల క్రింద వేక్సింగ్‌ చేసుకోవాలి.
2. మంచి బాడీ లోషన్‌తో చేతులకు మసాజ్‌ చెయ్యండి.
3. నెలలో 2 సార్లు మేనిక్యూర్‌ చేయించాలి.
4. ఎండ వల్ల మీ చెయ్యి నల్లబడితే సన్‌ స్క్రీన్‌ లోషన్‌ను ఉపయోగించండి.
5. భుజాల క్రింద పౌడర్‌ లేదా డియోడ్రెంట్‌ రాసుకోండి.
6. డీప్‌నెక్‌ లేదా స్లీవ్‌లెస్‌ కాటన్‌ సూట్‌ ధరించడం వల్ల ఎండ వేడి అంతగా బాధించదు.

అందానికి అలంకరణ నగలు!

ఆభరణాలు-అలంకరణ అనేది ప్రాచీన కాలం నుంచి వస్తూన్న సాంప్రదాయం. అన్ని దేశాల్లోనూ,అన్ని జాత్తుల్లోనూ,అన్ని కాలాల్లో నూ అలంకరణ మీద మోజు కనిపిస్తూనే ఉంది. కాని కాలనుగుణంగా ఎంతో మార్పులు వచ్చాయి.

మనదేశ సాంప్రదాయాన్ని తీసుకున్నట్లైతే వేద,ఇతిహాన కాలాల్లో కూడా స్త్రీ, పురుషులు వారి వారి హోదాను, అభిరుచిని బట్టి ఆభరణాలు ధరించేవారు. చారిత్రాత్మకంగా సింధునాగ రికత కాలంలో స్త్రీలు అలంకరణకు ప్రాముఖ్యం ఇచ్చేవారని చెప్పకనే చెప్తున్నది.

మన ప్రాచీన శిల్పాలు, అజంతా ఎల్లోరా కుడ్య చిత్రాలూ నాటి అలంకరణకు సాక్ష్యంగా నిలచి ఉన్నాయి.మన దేవాలయాల్లోని విగ్రహాలను రకరకాల ఆభరణాలతో అలం కరిస్తారు.

మధ్యయుగంలో కూడా మహారాజులు మొదలు సామాన్య ప్రజల వరకూ అనేక ఆభరణాలు ధరించినట్లుగా వాజ్మయం,సాంస్కృతిక చరిత్రలు,కైఫీయత్తుల వల్ల తెలుసుకోవచ్చు.

దేశ కాల పరిస్థితులేవైనా మానవుడు తన అభిరుచినీ,అవసరాల్నీ బట్టి అందం కోసం, విలాసం కోసం, రక్షణ కోసం ఆభరణాలను, విలువైన రాళ్లను ధరిస్తాడన్నది నిర్వివాద విషయం. అంతే కాకుండా రానురాను అలంకరణపైన అభిలాష పెరిగి, ఆభరణాలు ఉన్న సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి అన్న నమ్మకం కూడా ఏర్పడింది. ఏది ఏమైనా ఓ వ్యక్తి కట్టు చూడగానే ఆ వ్యక్తి హోదా, ఆర్థిక స్తోమత వ్యక్తిత్వాలతో బాటు మనస్తత్వం కూడా తెలుసుకోవచ్చు.

రుద్రాక్షమాలలు, తులసి పూసలూ ధరిస్తే అది వారికి ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని, ఆధ్యాత్మిక చింతనను ఇస్తాయని కొందరి నమ్మకం.నేటికీ మహాకవులనూ, వేదపండితులనూ వారి వారి పాండిత్యానికి చిహ్నంగా కాలిగి గండపెండేరం,చేతికి కంకణాలు తొడిగి సన్మా నిస్తుంటారు. కర్ణుడు కవచకుండలాలు ధరించి నంతకాలం అపజయమంటూ ఎరుగడట. శకుంతల మొదలైన మునికన్యకలు ధరించిన పూలమాలలు వారి నిరాడంబరమైన ఆశ్రమ వాతావరణానికి తగినట్లుగా ఉంటాయి. మన హైందవ సాంప్రదాయం ప్రకారం పెళ్లికూతురికి నల్లపూసలు, మట్టెలు,మంగళసూత్రం ధరింపజేస్తారు.ఇవి ఒక పవిత్రమైన బంధానికి ఒక్కొక్కరకం అంకరణ చేస్తుంటారు. గర్భిణీ స్త్రీలకు రంగు రంగుల గాజులు, వేయిస్తారు. హైందవ సంప్రదాయసిద్ధంగా పెళ్లికూతురికి పచ్చని, ఎర్రని గాజుల,బాలింతలకు ఆకుపచ్చని గాజులు వేయిస్తారు. సరోజినీనాయుడు తన ‘బ్యాంగిల్‌ సెల్లర్సు’ అనే పద్యంలో ఏయే రంగుల గాజులను ధరిస్తే శుభ ప్రదమనుకుంటారో చెప్పి హైందవ సంస్కృతిని చక్కగా వర్ణించేవారు.

సంప్రదాయ సిద్ధంగా కొన్ని ఆభరణాలను ధరించడం చూస్తూంటాం. చేతులకు,గాజులు, దండకడియాలు, చెవులకు దుద్దులు, జూకాలు, చెంపస్వరాలు ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. చెంపస్వరాలు, ముక్కుకి ముక్కు పుడక,  అడ్డబాస, తలకు కిరీటం పాపిడి బిళ్లలు, రాగిడి, సూర్యుడు, చంద్రుడు మొదలైనవి మెడలో కంటె కాసుల పేరు, రకరకాల హారాలు, నడుముకు మువ్వల వడ్డాణం కాళ్లకు కడియాలు, గొలుసులు, అందెలు, మువ్వలు, పాంజేబులు, వేళ్లకి ఉంగరాలు మొదలైనవి ముఖ్యంగా ధరించే నగలు శరీరంలో ఆయా అవయవాలకు ఆభరణాల వల్ల ఒక ప్రత్యేకత, రక్షణ కూడా లభిస్తాయనే ప్రజలు భావిస్తున్నారు.

ఆధునిక కాలంలో ఆభరణాలు ధరించడంలో అనేక మార్పులు సాంస్కృతిక పరంగా వచ్చేయి. ఇవి ముఖ్యంగా ఆర్థిక,సాంఘిక,సాంస్కృతిక పరంగా వచ్చేయి. పూర్వకాలం నుంచీ మన దేశం విదేశాలతో వర్తక వ్యాపారాలు చేసి, వెండి బంగారాలను, విలువైన రాళ్లను సంపాదించేది.కృష్ణదేవరాయల కాలంలో వజ్రవైడూర్యాలు ఎక్కువగా అమ్మే వారని చరిత్ర చెబుతోంది. మహమ్మదీయుల దండయాత్రలు, రెండు ప్రపంచ నిల్వలు తరిగి పోయాయి.

బంగారం వరిమాణం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. బ్రిటిష్‌ వారి పరిపాలనా కాలంలో మన వర్తక వ్యాపారాలు దెబ్బతినడంతో మన వెండి బంగారు నిల్వలు తరలి పోయాయి.

బంగారం అంతర్జాతీయ మారకద్రవ్యం. పరిశ్రమాభివృద్ధికి యంత్రాలను కొనటం కోసం, రక్షణకు, ఆయుధ పరికరాలను తెచ్చుకోవటం కోసం బంగారం ఆధారంగా కరెన్సీ ముద్రించి వినియోగిస్తున్నాం. విదేశీమారక ద్రవ్యం కోసం మన దేశం నుంచి అరబ్‌ దేశాలకు బంగారపు ఆభరణాలు 1997 సంవత్సరం నుంచి ఎగుమతి చేస్తున్నాయి.

ప్రస్తుత కాలంలో బంగారం ధర పెరగటం వల్ల ప్రజల్లో ఆభరణాల పట్ల ఆసక్తి తగ్గుతోంది. బంగారం సామాన్య ప్రజల అందుబాటులో లేదు. ఆనాడు బంగారం బాగా ఉన్న కుటుంబాలు సమాజంలో సంపన్న కుటుంబాలుగా ఉండేవి.కాని,ప్రస్తుతం బంగారం ధర పెరగటం వల్ల ధనవంతులకు అందుబాటులో ఉన్నప్పటికీ వాళ్లు కూడా ఆభరణాల వాడకం తగ్గిస్తున్నారు. ఆనాడు నగలు లేకపోతే స్త్రీలను సంఘంలో నిరాడంబరంగా నగలు ధరిస్తే అంత ఆధునిక నాగరికతగా పరిగణింపబడుతోంది.

అయినప్పటికీ ప్రజల్లో బంగారం మీద వ్యామోహం తగ్గలేదు.కారణం బంగారం ధర మాటిమాటికీ పెరగడమే కాని తగ్గక పోవడం.

ఫ్యాషన్లు మారిపోతున్నాయి. బంగారం ఆభరణాల స్థానంలో వివిధ రకాల అలంకరణ సాధనాలు రావడం వల్ల మరింత ఖర్చు పెరుగుతోంది. ఏవో కొన్ని నగలు ధరించకుండా స్త్రీలు ఉండలేకపోతున్నారు. బంగారం, వెండి నగల స్థానంలో ఇమిటేషన్‌ గోల్డు నగలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. రకరకాల పూసల దండలు తయారవు తున్నాయి.

సంఘంలో ఆర్థికస్తోమత తగ్గుతున్న కొద్ది ఆభరణాలూ అలంకరణ పట్ల స్త్రీల దృక్పథం సాధారణంగా తగ్గాలి. కాని మరింత పెరుగుతోందని చెప్పవచ్చు. అలంకరణ వల్ల ఆకర్షణ రాదనీ, సహజ సౌందర్యావిష్కరానికి వ్యక్తిత్వపు విలువలు ముఖ్యంగా తోడ్పడతాయనీ ప్రతి స్త్రీ గుర్తించిన నాడే దేశ భవిష్యత్తు చక్కబడుతుంది.