ఇంటి తలుపులపై ప్రత్యేక దృష్టి సారించండి

కొత్తగా ఇల్లు కట్టించేవారు తమ తలుపులకు ఏయే రంగులు వాడాలో తెగ ఆలోచిస్తుంటారు. రంగులకు బదులుగా డిజైన్లను ఏర్పాటు చేస్తే అది మరింతగా ఆకట్టుకుంటాయి. దీనికి చేయవలసిందేంటంటే…
ఇంటికి వాడే తలుపులపై వివిధ రకాల డిజైన్లను మీరు రూపొందించుకోవచ్చు. తలుపుల మీద మీ పేర్లనే కాదు… మీకు నచ్చిన బొమ్మలను కూడా డిజైన్ చేయించుకోండి.
ఇంటి సింహ ద్వారానికున్న తలుపుకు మీ పేరును చెక్కించుకోండి లేదా నేమ్ ప్లేట్ చేయించి దానిని తలుపులోనే ఇమిడేటట్లు చూడండి. పూజ గదికి మీ కిష్టమైన దేవుని ప్రతిమ, పిల్లల గదికి కార్టూన్లు కలిగిన బొమ్మలను చెక్కించండి. వంట గదికి కూరగాయలు లేదా పండ్లు కలిగిన డిజైన్‌తో కూడుకున్న బొమ్మలను చెక్కించుకోండి.
ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు మీరు వాడే కొయ్య ఒకే రకానికి చెందినదై ఉండేలా చూసుకోండి. వీటితో పాటు గ్లాస్ కాంబినేషన్ ఉంటే ఇంటికి మరింత అందం ఒనగూరుతుందంటున్నారు ఇంటీరియర్ డెకొరేటర్స్.

ఇంటిని అందంగా అలంకరించాలంటే?

ఇంటిని అందంగా అలంకరించడంలో ఓ ప్రత్యేకత ఉండాలి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే… ఇంటి బయటి గోడపై మెట్ ఫినిషింగ్ ఇచ్చి దానిపై చెక్కతో తయారు చేసినట్లు పెయింటింగ్ వేయండి. దీంతో మీ ఇంటికి కొత్త అందం వస్తుంది. ఆ గోడ చెక్కతో చేసిందేనా అనే అనుమానం రాక మానదు.మీ ఇంటి ఆవరణలో లేదా లాన్‌లో బోదతో ఓ చిన్న గుడిసె ఏర్పాటు చేసుకోండి. దీంతో మీరు పల్లెల్లో నివసించిన అనుభూతి కలుగుతుంది.ఇంటికి తోరణాలుగా కృత్రిమంగా కాకుండా ప్రకృతి పరమైన మామిడి ఆకులను కట్టి ఉంచండి. దీంతో నిత్యం మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందా అనే భావన కలుగుతుంది. ఇలా నిత్యం ఇంటికి తోరణాలు కడుతుంటే ఆ ఇల్లు సుఖ-శాంతులతో విరాజిల్లుతుంది.మీ ఇంటి బాల్కనీలో ఓ అందమైన ఊయలను ఏర్పాటు చేయండి. అది మీ ఇంటికే ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. డ్రాయింగ్ రూంలో మట్టితో తయారు చేసిన పాత్రలతో అలంకరించండి. వీలైతే ఇంట్లో లాంతర్ (లాల్‌టెన్) ను వ్రేలాడదీయండి. ఓ ప్రత్యేకమైన అందం వస్తుంది.

డైనింగ్ టేబుల్‌పై ఫ్రూట్ బౌల్స్‌తో అలంకరించండి

ఇంట్లోని మీ డైనింగ్ టేబుల్‌పై బ్లూ, ఆకుపచ్చ-ఎరుపు రంగులలో లభ్యమయ్యే బౌల్స్‌లో పండ్లను అమర్చండి. ఇలా వీటిని చూడంగానే ఓ సొఫిస్టికేటెడ్ లుక్ వస్తుంది.నున్నటి గ్లాస్‌వేర్‌తోపాటు మీకు నచ్చిన రంగులలోనున్న బౌల్స్‌లో పండ్లుంచండి. వీటిని చూడంగానే మీ ఇంటికొచ్చిన అతిథులు వాటిపట్ల ఆకర్షితులవుతారు. వెంటనే వాటిని తినేందుకు ఉత్సుకత చూపిస్తారనడంలో సందేహం లేదు.అలాగే వెదురుతో చేసిన బుట్టలను కూడా ఉపయోగించుకోవచ్చు. వీటిలో పండ్లను ఉంచండి. చూసేందుకు ఇది ప్రత్యేకంగా కనపడుతుంది. పిల్లలకైతే కార్టూన్‌లలోని పాత్రలున్న బొమ్మలతో కూడుకున్న ఫ్రూట్ బౌల్స్ ఉపయోగించండి.ప్రస్తుతం ప్రత్యేకంగా మెటల్‌తో తయారు చేసిన డిజైన్ కలిగిన బౌల్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. కొన్ని ప్రత్యేకమైన డిజైన్లలో ఇవి లభిస్తున్నాయి. ఇలాంటి బౌల్స్‌ కూడా ఉపయోగించవచ్చు.

ఇంటిని అందంగా తీర్చిదిద్దేందుకు చిట్కాలు

ఇంటిని అందంగా తీర్చిదిద్దడంలో మహిళలు నిరంతరం శ్రమిస్తుంటారు. మరింత అందంగా తీర్చిదిద్దేందుకుగాను ఇంటి కిటికీలు, తలుపులు, గోడలు మొదలైన ప్రదేశాలలో గ్లాసులను అలంకరించండి. వీటిపై మీకు వీలైతే గ్లాస్ పెయింటింగ్ వేయించండి లేదా పెయింటింగ్‌తో కూడుకున్న గ్లాస్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటిని ఇంట్లో అలంకరించండి.మీ ఇంట్లో పిల్లల గది రంగులమయం చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలకు రంగులంటే చాలా ఇష్టం. పిల్లలుండే గది గోడలకు ఎనామిల్ ప్రింట్ లేదా కార్టూన్‌లలోని పాత్రలకు చెందిన పోస్టర్‌లు అంటించండి.
మీరుండే ఇల్లు చిన్నదిగా ఉంటే అందులోని గదులు చిన్నవిగానే ఉంటాయి. ఆ గదులను పెద్దవిగా కనపడేలా ఉంచాలనుకుంటే ఏక్సెంట్ లైట్‌ను ఉపయోగించండి. ఆ లైట్‌ను ఫర్నీచర్ లేదా వాల్ ఆర్ట్‌పై ఫోకస్ చేయండి. దీంతో చిన్న గదికూడా పెద్ద గదిలా కనపడుతుంది.

గృహాలంకరణలో వెలుగులు

గదిలో ఎన్ని హంగులున్నా … దానికి కావలసినంత వెలుగుంటేనే అందంగా కనిపిస్తుంది. అందుకే గది పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని వాటికి సరిపోయే కాంతినందించే బల్బ్‌లను ఏర్పాటుచేస్తాం.

ప్రస్తుతం తక్కువ విద్యుత్‌ ఖర్చుతో ప్రకాశవంతగా వెలిగే ల్యాంప్‌ల హవా నడుస్తుంది. అయినా ప్రత్యేకతను కోరుకునేవారి కోసం మార్కెట్లోకి వింతైనా బల్బులు వస్తున్నాయి. ఇవి వెలుగుని అందించడమే కాకుండా ఆకర్షణగా ఉన్నాయి.

అందులో హాల్లో ఏర్పాటు చేసుకునేందుకు పక్షులు గదిలో వాలినట్లుంటే బర్డ్‌ ఆన్‌ వైర్‌ ల్యాంప్‌, పిల్లలలకు ఇష్టమైన కలువ పూవుల్లాంటి బల్బులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. వాడి చూడండి మార్పు మీకే తెలుస్తుంది.

వర్షాకాలంలో ఇల్లంతా పరిమళాల జల్లు

వర్షాకాలంలో పడే వానల వల్ల ఇల్లంతా ఒక రకమైన వాసన వస్తుంటుంది. చెడు వాసనని తొలగించి ఆ స్థానంలో ఉత్సాహాన్ని నింపే వాసనలు వెదజల్లితే ఎంత బాగుంటుందో కదూ..! అందుకే ఇల్లు పరిమళ భరితం కావాలంటే… కిటీకీలు, తలుపులు ఎప్పుడూ బిగించి ఉంచకండి. వాటిని వీలైనంత వరకు తెరిచే ఉంచండి. దీంతో ఇంట్లో ఉన్న చెడు వాసన దాదాపు తగ్గిపోతుంది. ఇలాచేస్తే సూర్యకిరణాలు నేరుగా ఇంట్లో పడతాయి. ఈ వెలుగు సూక్ష్మక్రిములను నశింపచేస్తుంది.

* బాత్రూం, వంటిట్లో నాణ్యమైన ఎగ్జాస్ట్ ఫ్యాన్స్‌ని విధిగా అమర్చాలి. వంటింట్లో వాసనలు తొలగాలంటే కాసిన నీటిలో నిమ్మకాయ తొక్కలను వేసి మరిగించాలి. ఇవి ఇల్లంతా వ్యాపించి మంచి వాసనను ఇస్తాయి. లేదంటే వేడినీటిలో నారింజ తొక్కలను వేసి మరిగించాలి లేదా కాసింత రసాన్ని పిండినా సరే.

* బాసిల్‌ ఆకులని వెడినీటిలో మరిగించి ఆ నీటిని ఇంట్లో అక్కడక్కడా ఉంచినా మంచి వాసన వస్తుంది. ఇంటిచుట్టూ బేకింగ్‌ పౌడర్‌ని జల్లితే ఈగలు ఇంట్లోకి రావు. కార్పెట్లు వాసన రాకుండా వాటిని బేకింగ్‌ సొడా కలిపిన నీటిలో నానబెట్టి వాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రపరచాలి. సెంటెడ్‌ క్యాండిల్స్‌ను ఇంట్లో వెలిగిస్తే.. వెన్నెల్లా మంచి వెలుతురు ఇస్తూనే మనసుని మురిపించే వాసనలు వెదజల్లు తుంటాయి.

వంటగది శుభ్రతకు కొన్ని చిట్కాలు

మన గృహాల్లో వంటగదికి మనమిచ్చే ప్రాధాన్యమే వేరు. వంటగదిలో ఉపయోగించే ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ చూపే సంగతి తెలిసిందే.వంటగదిని అందంగానూ, పొందిగ్గానూ అమర్చుకోవాలా? మీకోసం కొన్ని చిట్కాలు… వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇందుకోసం అందుబాటులో స్పాంజ్‌ లాంటి టవల్‌ను ఉపయోగించుకోవాలి.

పెద్ద పెద్ద కబోర్డుల్లో వాడే పాత్రలను ముందుగానూ… ఇంటికి అతిథులొస్తే వాడే పాత్రలను వెనుక పక్కగానూ అందంగా అమర్చుకోవాలి. పేపర్ ప్లేట్‌లు, స్టీల్ ప్లేట్‌లు టవల్స్‌లను ఒకే సెల్ఫ్‌లో చేతికి అందే విధంగా అమర్చుకోండి. రోజు అవసరమయ్యే వస్తువులు అందుబాటులో ఉండేటట్టు సర్దుకోండి. స్నాక్‌ డబ్బాలను ఉంచుకునేందుకు, ఉప్పులు, పప్పులు వంటివి పెట్టుకోనికి ప్రత్యేకంగా ఓ అలమారిని ఎంచుకోండి.

ఏ డబ్బాలో ఏమున్నాయో చూడగానే తెలిసేలా వాటిపై పేర్లను రాసి లేబుల్‌ను అతికించుకోండి. ఇలా చేస్తే వంటచేసే సమయంలో వెతుక్కోవాల్సి పని తప్పు తుంది. కొందరి గృహాల్లో వందగదిలో స్థలం సరిపోక హాలుల్లో ఫ్రిజ్‌లను ఉంచడం పరిపాటి.

ఇలా ఉంటే వంటకు కావాల్సిన కూరగాయల్ని ఒకే సారిగా ఓ ప్లేట్‌లో గానీ లేదా ప్యాన్‌లో వేసి తెచ్చుకుని తరుక్కోండి. దీనివల్ల పదేపదే ఫ్రిజ్ దగ్గరకు వెళ్లే పని తగ్గుతుంది. వీలైనంతవరకు ఫ్రిజ్‌ను వంటగదిలోనే ఉంచుకోవడం మంచిది. ఇలా ప్రతి పనిని ప్రణాళికతో చేస్తే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మళ్ళీ సర్దుకోడానికి సులువుగా ఉంచుకునేందుకు ఆస్కారం ఉంటుంది.