అహ్మదాబాద్ లో టాటానానో కారులో దట్టమైన పోగలు..!

టానానో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. దీనికి కారణం టాటానానో కారు లో కేబుల్ కనెక్షన్ తప్పుగా ఇవ్వడం వల్లే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని అహ్మదాబాద్ యూనిట్ వారు వెల్లడించారు. ఇటువంటివి జరగడం వల్ల జనాభాకి టాటానానో పై ఉన్న నమ్మకం పోతుందని వాపోతున్నారు. టాటానానో కారు ఓనర్ మాట్లాడుతూ పార్క్ చేసినటువంటి నా కారు నుంటి దట్టమైన పోగలు రావడం గమనించానని అన్నారు. ఇది గమనించినటు వంటి ఓనర్ కంపెనీకి తెలియజేయడం జరిగిందన్నారు. దీనిపై స్పందించిన టాటానానో కంపెని అధికారి ఒకరు ఈ విషయంపై ఇన్విస్టిగేషన్ కి పురమాయించామని అన్నారు. నిజానికి ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరగలేదని నానో కారు నుండి పోగలు మాత్రమే వచ్చాయని ఓనర్ తమతో అన్నట్లు వివరించారు. నానో కారు విడుదలై సంవత్సరం అయినప్పటికి కేవలం ఏడు సార్లు మాత్రమే ఇలాంటివి జరిగాయన్నారు.

గతంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ ఇన్సిడెంటేనని, ఇది కేవలం కేబుల్స్ సరిగా కలపకపోవడం వల్లే జరిగిందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకోని టాటా నానో భద్రత విషయంలో 20మంది ఫోరెన్సిక్ ఇంజనీర్లను టీమ్ గా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కంపెనీ నుండి వచ్చే ప్రతి టాటా నానో కారుని వీరు క్షణ్ణంగా పరిశీలించడమే కాకుండా, కంపెనీ ఓనర్స్ తోకూడా సేప్టీ గురించి మరియు వారికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు వివరిస్తానన్నారు. ప్రస్తుతం యావత్ భారతదేశంలో దాదాపుగా 62000యూనిట్స్ ని డెలివరీ చేయల్సిఉందన్నారు. వీటన్నింటిపై జనాభాకు క్లుప్తంగా వివరించడానికి నానో సూపర్ డ్రైవ్ అనే కార్యక్రమం చేపట్టిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ సూపర్ డ్రైవ్ 15000కిమీ ప్రయాణించి 36పట్టణాలను 26రోజులలో ఎటువంటి అవాంతరాలు లేకుండా దిగ్వజయంగా ముందుకి సాగుతుందన్నారు.

ఇదివరకే అనుకున్నాం కదండీ టాటా నానోకారు గురించి

నానోతో డ్రైవింగ్ కొంచెం జాగ్రత్త సుమా!


కారు కొంటే ఐప్యాడ్ ఉచితం..

హుందాయ్ మోటార్స్ ఇటీవలే న్యూయార్క్ ఆటో షోలో విడుదల చేసిన లగ్జరీ కారు ఇక్కూస్ కు అన్ని వర్గాల నుండీ మంచి స్పందన లభించింది. దీంతో ఈ కారుకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్న హుందాయ్ మోటార్స్ మరో స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఈ కారు కొనండి ఉచితంగా ఐప్యాడ్ ను అందుకోండి అని తెగప్రచారం చేస్తోంది. ఇక అమెరికాలో ఐప్యాడ్ కు ఉన్నంత డిమాండ్ ప్రస్తుతం మరే వస్తువుకూ లేదని సర్వేలు తేల్చిచెబుతున్నాయి. మరి అలాంటి ఐప్యాడ్ వస్తుందంటే అక్కడ కారు కొనేసే మహానుభావులూ వున్నారట. దీంతో ఈ స్కీమ్ కు విశేష స్పందన లభిస్తోందట.

ఇక ఈ లగ్జరీ కారు ధర 55 వేల అమెరికన్ డాలర్లు(సుమారు 25 లక్షలు)…దీనికి 600 డాలర్లు(సుమారు 27 వేలు) విలువచేసే ఐప్యాడ్ ఉచితంగా ఇస్తామనేస్తూ వచ్చే ఏడాదికి 3,000 ఇక్కూస్ కార్లను అమ్మాలని హుందాయ్ సంస్థ కలలు కంటోంది. ఇక ఈ సదుపాయం ఒక్క అమెరికా వాసులకే లెండి. మరీ కారు ఇక్కడ ఎప్పుడు విడుదలవుతుందో ఇంకా సరయిన సమాచారం లేదు.

భారతీ,జైన్‌ మధ్య నైజీరియా అడ్డు

ఆఫ్రికాలో టెలికం కార్యకలాపాలు ఆరంభించడం ద్వారా ప్రపంచంలోని టాప్‌ 5 టెలికం సంస్థల్లో ఒకటిగా నిలవాలన్న భారతీ ఎయిర్‌టెల్‌ ఆశలు ఇప్పట్లో సఫలమయ్యేలా లేవు. నైజీరియాలో జైన్‌తో కలిసి టెలికం సేవలందిస్తున్న ఎకోనెట్‌ వైర్‌లెస్‌ ఈ డీల్‌ను అంగీకరించడం లేదని సమాచారం. ఇప్పటికే ఆఫ్రికాలోని మొరాకో, సూడాన్‌లను వదిలేసుకున్న ఎయిర్‌టెల్‌ నైజీరియాను ఎలాగైనా కలుపుకోవాలని లేదంటే డీల్‌ను రద్దు చేసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.కువైట్‌ టెలికం సంస్థ జైన్‌తో ఒప్పందం తుది రూపాన్ని సంతరించుకుంటున్న వేళ మరో అడ్డంకి ఎదురైంది.

ఆఫ్రికాలోని పెద్ద దేశాల్లో ఒకటైన నైజీరియాలో జైన్‌తో కలిసి టెలికం సేవలందిస్తున్న ఎకోనెట్‌ వైర్‌లెస్‌ భారతీతో డీల్‌ తమకు ఆమోదయోగ్యం కాదని అడ్డం తిరిగింది. నిజానికి జైన్‌లో ఎకోనెట్‌ వాటా చాలా స్వల్పమైనప్పటికీ, నైజీరియన్‌ యూనిట్‌లో ఎకోనట్‌ వాటా 65 శాతంగా ఉంది.. ఎప్పటినుంచో ఎకోనట్‌ పూర్తిగా తమకు యూనిట్‌ను అప్పగించాలని జైన్‌ను కోరుతోంది. ఇప్పుడు ఎకోనట్‌ అనుమతి లేకుండా తమ వాటాను ఎలా విక్రయిస్తారని సంస్థ చైర్మన్‌ స్ట్రైవ్‌ మిసాయివా వ్యాఖ్యానించారు. ఆఫ్రికా టెలికం రంగంపై నివేదిక తయారు చేసే నిమిత్తం గోల్డ్‌మన్‌ సాక్స్‌ ఎనలిస్ట్‌ హ్యూగ్‌ మెక్‌ కాఫ్రీ ఇటీవల మిసాయివాను కలిశారు. మెక్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం నైజీరియా కార్యకలాపాలు అమ్మకానికి లేవు. జైన్‌, ఎకోనట్‌ల మధ్య యాజమాన్య వివాదం కొనసాగుతున్నందున అది తేలేంత వరకూ తాము ఒప్పందాన్ని అంగీకరింజబోమని మిసాయివా స్పష్టం చేశారని మెక్‌ నివేదికలో వెల్లడించారు.
నైజీరియాలో జైన్‌ యాజమాన్యాన్ని సవాలు చేస్తూ, ఆ దేశపు కోర్టులతో పాటు డచ్‌ కోర్టులో సైతం కేసులు విచారణ దశలో ఉన్నాయి. జైన్‌ ఉన్నతాధికారులు భారతీ ఎయిర్‌టెల్‌ బోర్డుకు ఈ విషయాలన్నింటినీ వివరించే ఉంటారని భావిస్తున్నామని ఎకోనట్‌ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. కాగా, ఇటువంటి వివాదాలు వస్తాయని ముందుగానే ఊహించి తగు జాగ్రత్తలు తీసుకున్నామని భారతీ అధికారి ఒకరు తెలిపారు.

జైన్‌ బోర్డుతో తమకు ఎటువంటి వివాదాలు లేవని, ఇతర సంస్థలతో కొనసాగుతున్న లావాదేవీలను జైన్‌ చూసుకుంటుందని ఆయన వివరించారు. ఈ వివాదం మరింతగా బలీయమైతే భారతీ ఎయిర్‌టెల్‌ నైజీరియా వాటాను వదులుకోకతప్పదని మెక్‌ తన నివేదికలో పేర్కొన్నారు. నైజీరియా యూనిట్‌లో 65 శాతమున్న ఎకోనెట్‌ను కలుపుకోకుండా జైన్‌ కార్యకలాపాలను ఆ దేశంలో భారతీ సొంతం చేసుకోవడం ఎంతమాత్రం సాధ్యం కాదు. ఓనర్‌షిప్‌ రైట్స్‌ మార్పిడి వ్యవహారంలో జైన్‌ వైఖరిని తప్పు పడుతూ పరిహారం కోసం ఎకోనెట్‌ కోర్టులను ఆశ్రయించేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం.

10.7 బిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందంపై మార్చి నెలాఖరులో ఇరు కంపెనీలూ సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. కొత్త ఆర్థిక సంవత్సరంలో అన్ని ఆఫ్రికా దేశాల మార్కెట్ల రెగ్యులేటరీ అనుమతులు పొందిన తరువాత ఒప్పందం అమలవుతుంది. ఒప్పందంపై సంతకాల అనంతరం ఇక ఏ విధనైన అడ్డంకులూ తమకు లేవని వ్యాఖ్యానించడం గమనార్హం.

రికార్డు స్థాయి వృద్ధిని సాధించిన హుందాయ్

భారతీయ రెండవ అతి పెద్ద ఆటోమొబైల్ సంస్థ హుందాయ్ మోటార్స్ గత నెల మార్చిలో రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసుకుంది. మార్చి నెలకు గాను మొత్తంగా 55,035 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసుకున్న హుందాయ్ మోటార్స్ రికార్డు స్థాయిలో 27.3% వృద్ధిని నమోదు చేసుకుంది. ఇక గత ఏడాది మార్చి నెలకు గాను నమోదయిన అమ్మకాలు 46,159 లో పోల్చితే ఈ ఏడాది అమ్మకాల్లో భారీ పెరుగుదల నమోదు చేసుకుంది.

ఇక A2 విభాగంలోని కార్లు సాంత్రో, i10, గెట్జ్ మరియు i20 కార్లు 50,715 సంఖ్యలో అమ్ముడుపోగా, A3 విభాగంలోని అస్సెంట్ మరియు వర్నా కార్లు 4,276 సంఖ్యలో అమ్ముడుపోయి ఈ భారీ వృద్ధికి తోర్పడ్డాయి. ఇక A5 విభాగంలో సొనాటా కార్లు 44 యూనిట్లు అమ్ముడుపోగా, SUV విభాగంలోని టస్కన్ కార్లు ఒక్కటి కూడా అమ్ముడు కాకపోవడం గమనార్హం.

పెరిగిన మారుతీ కార్ల ధరల వివరాలు

భారతీయ లీడింగ్ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ కార్ల మీద ధరలను పెంచినట్టు ప్రకటించింది. భారత్ స్టేజ్ IV నిబంధనల ప్రకారం ఇంధనం ధర, కారు ముడి సరుకు ధర పెరగటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

చిన్న కార్లు రిట్జ్, ఎ స్టార్ కార్ల మీద రూ.1000 లు, ఎస్టిలో కారు మీద రూ.2,500 లు, స్విఫ్ట్ కారు మీద రూ.3,750 మేర ధరను పెంచినట్టు సంస్థ ప్రకటించింది. ఇక ప్రముఖ నగరాల్లో కనుమరుగయిపోయిన మారుతీ 800 కారు కూడా పట్టణాల్లో రూ.3000 ఎక్కువ ధర పలకనుంది.

ఇక సేదన్ కార్లు డిజైర్ రూ.7,000 లు, SX4 రూ.9000 లు, ఈకో కారు రూ.10000 మేర ధర పెంచనున్నట్టు సమాచారం. ఈ కొత్త ధరలు ఈ నెల నుండే అమలు కానున్నాయి.

సిమెంటు పరిశ్రమకు కష్టకాలం

2010-11 సంవత్సరంలో సిమెంటు పరిశ్రమ పరిస్థితి 2009-10 సంవత్సరం అంత సాఫీగా ఉండకపోవచ్చు. ఉత్పత్తి వ్యయం పెరగడం, డిమాండు కంటే సరఫరా ఎక్కువ కావడం వల్ల సిమెంటు పరిశ్రమ కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. వర్షాకాలం ప్రారంభం కాగానే సిమెంటు వినియోగం తగ్గుతుంది. అప్పటి నుంచి సిమెంటు కంపెనీల మార్జిన్‌లు తగ్గే ప్రమాదం ఉంది.  ఇన్‌పుట్‌ ఖర్చు పెరగడం, రవాణా ఛార్జీలు పెరగడం వల్ల ఇటీవలి కాలంలో 50 కేజీల సిమెంటు బస్తా ఉత్పత్తి చేయడానికి ఖర్చు రూ.20 పెరిగింది. అయితే మార్కెట్లో సిమెంటు పుష్కలంగా ఉండటం వల్ల ఈ రూ.20 అదనపు భారాన్ని కొనుగోలుదారులపై నెట్టడం సాధ్యంకావడం లేదు. 2010 సంవత్సరంలో ఇండియాలో అదనంగా 50 మిలియన్‌ టన్నుల సిమెంటు ఉత్పత్తికి కెపాసిటీ ఏర్పాటు అవుతున్నది. దీనితో 300 మిలియన్‌ టన్నుల కెపాసిటీ ఏర్పడింది.

అందులో 75 శాతం సిమెంటు మాత్రమే ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. 2009-10 సంవత్సరంలో సిమెంటు కంపెనీలు పది
శాతం మించి వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ఆదిత్యాబిర్లా గ్రూపు 15 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. 2008-09లో ఇండియాలో 178.2 మిలియన్‌ టన్నుల సిమెంటు అమ్ముడయింది.

కేజీ బేసిన్‌ నుంచి రెండు కంపెనీలు అవుట్

కేజీ బేసిన్‌లో ఒఎన్‌జిసి చేపట్టిన చమురు అన్వేషణలో పాల్గొనరాదని నార్వే కంపెనీ స్టాట్‌ ఆయిల్‌, బ్రెజిల్‌ కంపెనీ పెట్రోబ్రాస్‌ నిర్ణయించాయి. ఈ అన్వేషణలో తమ రెండు కంపెనీల పాత్రపై భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో చాలా జాప్యం జరుగుతున్నందున ఈ రెండు కంపెనీలు ఈ నిర్ణయానికి వచ్చాయి.

పెట్రోబ్రాస్‌ బ్రెజిల్‌ ప్రభుత్వరంగ సంస్థ. కేజీ బేసిన్‌లో తనకు ఉన్న 15 శాతం వాటాను ఒఎన్‌జిసికి ఉచితంగా ఇవ్వడానికి సంసిద్ధతను వ్యక్తంచేసింది. ఈ చమురు క్షేత్రం కేజీ -డి6 రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ క్షేత్రం పక్కన ఉన్నది. ఆంధ్రాకోస్తాలో భవిష్యత్తు డ్రిల్లింగ్‌ కార్యకలా పాల్లో పాల్గొనరాదని స్టాట్‌ ఆయిల్‌ నిర్ణయించింది. పెట్రోలియం శాఖ, డిజిహెచ్‌ విదేశీ కంపెనీలు వాటా ధనాన్ని సమకూర్చ డానికి అయిష్టంగా ఉన్నాయి.

అందువల్లనే డ్రిల్లింగ్‌ కార్యక్రమానికి అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నాయి. ఒఎన్‌జిసి తాను స్వయంగా ఈ చమురు క్షేత్ర అన్వేషణ జరిపి చమురు, గ్యాస్‌ లభ్యం అయితే వాటిని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 14 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్‌ రిజర్వులు ఉన్నట్లు అంచనా. సముద్రంలోతైన ప్రాంతాల్లో గ్యాస్‌ను ఉత్పత్తి చేసే టెక్నాలజీ ప్రస్తుతం ప్రభుత్వరంగ సంస్థకు లేదు. కేజీ బేసిన్‌లో గ్యాస్‌ అన్వేషణ కొంచెం క్లిష్టమైన కార్యక్రమం.

దీనిపై ఒఎన్‌జిసి సిఎండి ఆర్‌ఎస్‌ శర్మ చమురు శాఖ కార్యదర్శికి ఒక లేఖ రాసినట్లు తెలుస్తున్నది. తాము వాటా తీసుకున్న చమురు క్షేత్రాల్లో అన్వేషణ కార్యక్రమంలో పాల్గొనడానికి అంతర్జాతీయ కంపెనీలు వెనుకాడుతున్నాయని, దీనికి ప్రభుత్వంలో రెడ్‌టేప్‌జిం కారణమని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. 2007 సంవత్సరంలో ఒఎన్‌జిసి కేజీ బేసిన్‌ చమురు క్షేత్రాల్లో 15 శాతం వాటా పెట్రోబ్రాస్‌కు పది శాతం వాటా స్టాట్‌ ఆయిల్‌కు ఇచ్చింది. ఈ అంతర్జాతీయ కంపెనీల సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియో గించుకోవడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఒఎన్‌జిసి సిఎండి తన లేఖలో పేర్కొన్నారు.

ఈ చమురు క్షేత్రంలో పది చోట్ల గ్యాస్‌ నిల్వలు ఉన్నట్లు తేలింది. అయితే ఆ నిల్వలు ఏమేరకు ఉన్నాయో తెలుసుకోవడానికి మరింత డ్రిల్లింగ్‌ జరగాల్సిఉంది. అలా తెలుసుకున్న తర్వాత గ్యాస్‌ క్షేత్రం అభివృద్ధికి పెట్టుబడులు పెడతారు. కేజీ బేసిన్‌లోనే కాకుండా కావేరి బేసిన్‌లో కూడా అంతర్జాతీయ కంపెనీలకు ప్రభుత్వ వైఖరి అడ్డంకులు సృష్టిస్తున్నదని శర్మ తన లేఖలో విమర్శించారు. 2009 జనవరిలో ప్రభుత్వంతో జరగాల్సిన సంతకాలు ఆగిపోయాయని, దీనివల్ల అంతర్జాతీయ కంపెనీల్లో అనుమానాలు ఏర్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ కంపెనీలు వైదొలగడం వల్ల ఒఎన్‌జిసికి రిస్క్‌ ఎక్కువ అవుతుందని ఆయన పేర్కొన్నారు. గ్యాస్‌ ధర, పన్ను రాయితీల విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేకపోవడం పెట్రోబ్రాస్‌ వైదొలిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో ఉన్న పోటీని తట్టుకోవడానికి ఒఎన్‌జిసి ప్రయత్నిస్తున్నదని, ప్రభుత్వ నిర్ణయాల్లో జాప్యం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయని ఆయన విమర్శించారు.

అక్టోబర్‌లో ఎయిర్‌టెల్‌ 3జి సర్వీసులు

భారతి ఎయిర్‌టెల్‌ తన 3జి సర్వీసులను ఈ సంవత్సరాంతంలోగా ప్రారంభిస్తుంది. 3జి నెట్‌వర్క్‌ సిద్ధంగా ఉన్నదని, బిల్లింగ్‌ అప్లికేషన్‌ కంటెంట్‌ అంశాలు కూడా సిద్ధంగా ఉన్నాయని, బిడ్డింగు పూర్తికాగానే ఆరు నుంచి ఎనిమిది నెలల్లోగా సర్వీసులను పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని భారతిఎయిర్‌టెల్‌ సిఇఓ (ఇండియా, దక్షిణాసియా) సంజయ్ కపూర్‌ చెప్పారు. హెచ్‌టిసి స్మార్ట్‌ ఫోన్‌ను ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌కు ప్రత్యేకంగా ప్రారంభించారు. 3జి స్పెక్ట్రమ్‌ వేలం ఏప్రిల్‌ తొమ్మిదిన జరగాల్సి ఉంది. బిడ్డింగులో విజయం సాధించిన కంపెనీలు 2010 సెప్టెంబరు ఒకటి తర్వాతనే తమ సర్వీసులను ప్రారంభించాల్సి ఉంటుంది.

భారతి ఎయిర్‌టెల్‌ అక్టోబరు నుంచి ఈసర్వీసును ప్రారంభించే అవకాశం ఉంది.భారతి ఎయిర్‌టెల్‌ 3జి స్పెక్ట్రమ్‌ కోసం బ్రాడ్‌బాండ్‌ కోసం కూడా బిడ్‌లు సమర్పించింది. భారతి ఒక్కటే కాకుండా ప్రధాన మొబైల్‌ కంపెనీలన్నీ ఆఫర్లు ఇచ్చాయి. వొడాఫోన్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్‌, టాటాలు, ఐడియా సెల్యూలార్‌ కూడా 3జి స్పెక్ట్రమ్‌ కోసం బిడబ్ల్యుయుఎ స్పెక్ట్రమ్స్‌ కోసం దరఖాస్తు చేస్తాయి. ఇటిసలాట్‌, వీడియోకాన్‌లు మాత్రం ఒక్క 3జి స్పెక్ట్రమ్‌ కోసమే దరఖాస్తు చేసాయి. క్వాల్‌కామ్‌, హెచ్‌ఎఫ్‌సిఎల్‌, టికోనా, స్పైస్‌ వంటి కంపెనీలు కేవలం బిడబ్ల్యుయుఎ కోసమే దరఖాస్తు చేసాయి.

దేశవ్యాప్తంగా 3జి స్పెక్ట్రమ్‌ కావాలనుకునే కంపెనీలకు రూ.3,500 కోట్ల రిజర్వు ధరను నిర్ణయించారు. బ్రాడ్‌బాండ్‌ వైర్‌లెస్‌ యాక్సెస్‌ సర్వీసు కోసం రూ.1750 కోట్లు రిజర్వు ధరగా నిర్ణయించారు. అయితే ఈ స్పెక్ట్రమ్‌ కోసం చాలా కంపెనీలు పోటీపడుతుండటం వల్ల బిడ్డింగు ధర ఎక్కువగానే ఉండవచ్చు. దేశవ్యాప్తంగా కనీసం ముగ్గురు ఆపరేటర్లకు స్పెక్ట్రమ్‌ విక్రయిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో నలుగురు ఆపరేటర్లకు స్పెక్ట్రమ్‌ విక్రయిస్తారు. 3జి మొబైల్‌ సర్వీసు అతివేగంగా కంటెంట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఎయిర్‌టెల్‌కు ప్రస్తుతం దేశంలో 12.46 కోట్ల వినియోగదారులు ఉన్నారు.

ఐదవ పెద్ద టెలికాం సంస్థగా అవతరించనున్న ‘భారతీ ఎయిర్‌టెల్‌’

దక్షిణాఫ్రికాలో సేవలందిస్తున్న దుబాయి టెలికాం దిగ్గజం జెయిన్‌ ను, భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థ కొనుగోలు చేయడానికి నిర్ణయించడం దేశ పురోగతికి, ఆర్ధిక సత్తాకు నిదర్శనమని ఇండియన్‌ ఇంక్‌ పొంగిపోతోంది. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన ఒక టెలికాం సంస్థను భారత్‌ కొనుగోలు చేయడం ఇదే ప్రధమమని భారత బ్రాండ్‌ ఈక్విటీకున్న పరిధిని, సమర్ధతను ఇది చాటుతోందని భారత పరిశ్రమలు, వాణిజ్య మండళ్ళ సమాఖ్య (ఫిక్కీ) ప్రధాన కార్యదర్శి అమిత్‌ మిత్రా అభిప్రాయపడ్డారు. దేశీయ పారిశ్రామిక రంగం ఔన్నత్యానికి అద్దం పట్టే ఈ సంఘటన కొత్త కోణాలను ఆవిష్కరిస్తునదని, భారత-దక్షిణాఫ్రికాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత మెరుగు పరుస్తుందని చెప్పారు.

భారత పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు వేణు శ్రీనివాసన్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ విదేశీ మార్కెట్లలో భారత్‌ వేస్తున్న మరో ముందడుగు ఇదని, దీనికి దేశం గర్వపడాలని, దేశంలోని ఇతర కంపెనీలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. 48,000 కోట్ల రూ.లకు భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థ జెయిన్‌ టెలికాంను కొనుగోలు చేయడానికి మంగళవారం జెయిన్‌ ఆఫ్రికా కేంద్ర కార్యాలయమైన ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో సంతకాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో వినియోగదారులున్న ఐదవ పెద్ద టెలికాం సంస్థగా భారత ఎయిర్‌టెల్‌ అవతరించనుంది.

భారతీ కంపెనీని స్ఫూర్తిగా తీసుకోవాలి : సాల్మన్‌ ఖుర్షీద్
దేశంలోని అనేక పెద్ద కంపెనీలు భారతీ ఎయిర్‌టెల్‌ను స్ఫూర్తిగా తీసుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి సాల్మన్‌ ఖర్షీద్‌ ఆకాంక్షించారు. ఇంత పెద్ద కొనుగోలు వ్యవహారంలో భారతీ సంస్థ మొదట్లో కొంచెం తడబడినా, కొనుగోలు వ్యవహారాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని ఆయన కొనియాడారు. ప్రపంచస్థాయి భారత కంపెనీల ప్రస్థానంలో ఇది తొలి అడుగువంటిదని అభివర్ణించారు. ఈ కొనుగోలు వ్యవహారంపై భారతీయుడిగా తాను ఎంతో గర్విస్తున్నానని కేంద్ర రెవిన్యూ శాఖ కార్యదర్శి సునీల్‌ మిత్రా పేర్కొన్నారు.

కువాయిట్‌ మార్కెట్లో లిక్విడిటీ పెంచే చర్య
భారతీ ఎయిర్‌టెల్‌, జెయిన్‌ను కొనుగోలు చేయడం దుబాయి మార్కెట్లో లిక్విడిటీని పెంచుతుందని, ఆ సంస్థలో ప్రధాన భాగస్వామి అయిన ఖరాఫీ గ్రూప్‌ అభిప్రాయపడింది. గ్రూప్‌ వైస్‌ ఛైర్మన్‌ బదీర్‌ అల్‌ ఖరాఫీ కువాయిట్‌కు చెందిన అల్‌ వాటన్‌ డైలీకి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న దుబాయి ప్రాంతంలో ఈ కొనుగోలు వ్యవహారం మార్కెట్లో విశ్వాసాన్ని కలుగచేసి లిక్విడిటీని అభివృద్ది పరుస్తుందని చెప్పారు. దుబాయిలో వ్యక్తులు, సంస్థలు ఎక్కువ సంఖ్యలో ఏదో ఒక రకంగా జెయిన్‌తో సంబంధం ఉన్నవారేనని, కాబట్టి ఈ వ్యవహారంలో వారంతా లబ్ది పొందుతారని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో ఏ మంచి అవకాశం తనముందుకు వచ్చినా, ప్ర పంచస్థాయి సంస్థగా జెయిన్‌ దాని వదులుకోబోదని ఆయన వ్యాఖ్యానించారు.

బాగానే లబ్ది పొందాం : జెయిన్‌
క్రయ, విక్రయాలకు సంబంధించి జెయిన్‌ టెలికాం, భారతీ ఎయిర్‌టెల్‌ సంతోషంగానే ప్రతిస్పందించాయి. ఈ కొనుగోలు వ్యవహారంలో తాము 3.3 బి.డాలర్ల నుండి 10.7 బి.డాలర్లకు లబ్ది పొందామని జెయిన్‌ ప్రకటించగా, కొనుగోలుకు మంచి ధరనే చెల్లించామని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. కువైట్‌ స్టాక్‌ ఎక్చేంజ్‌కు జెయిన్‌ రాసిన లేఖలో సుడాన్‌, మొరాకో మినహా మిగిలిన దక్షిణాఫ్రికా వైర్‌లైస్‌ వ్యాపారాన్ని ఎయిర్‌టెల్‌కు విక్రయించినట్లుగా పేర్కొంది. ఈ డీల్‌పై సంతకం కాగానే భారతీ ఎయిర్‌టెల్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ స్పందిస్తూ ఈ కొనుగోలు వ్యవహారంలో తాము పూర్తి సౌకర్యంగా ఉన్నామని, మంచి ధరను వెచ్చించామని సంతృప్తి వ్యక్తం చేశారు.

జెయిన్‌ సంస్థను కొనుగోలు చేయడానికి భారతీ ఎయిర్‌టెల్‌ 8.3 బిలియన్‌ డాలర్లను రుణంగా పొందింది. 700 మి.డాలర్ల ఏడాది తరువాత చెల్లించడానికి ఒప్పం దం కుదుర్చుకుంది. తన ఖాతాలలో 1.7 బి.డాలర్లను రుణంగా చూపించింది. తమ ఆస్తి అప్పుల పట్టీ మీద ఈ భారీ రుణం ప్రభావితం చూపిస్తుందా అని పిటీఐ అడిగిన ప్రశ్నకు సునీల్‌ మిట్టల్‌ స్పందిస్తూ రుణం తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తామని, అందుకు చాలా సమయం ఉందని, పైగా తాము ఆర్ధికంగా పటిష్టంగా ఉన్నామని చెప్పారు. భారతీ-జెయిన్‌ డీల్‌ వ్యవహారంపై మదుపరులు కూడా హుషారుగా స్పందించారు.

భారతీ ఎయిర్‌టెల్‌ షేర్ల ధరలు మూడు శాతం పైకెగిశాయి. ఆయా దేశాలలో నియంత్రణ వ్యవస్థల ఆమోదం పొందడానికి ఈ సంస్థలు ఇక ప్రయత్నిస్తాయి. ఆఫ్రికన్‌ వ్యాపార వ్యవహరాలను సంస్థ జెఎండి, సిఇవో ఇంటర్నేషనల్‌ మనోజ్‌ కోహ్లీకి అప్పగిస్తూ మిట్టల్‌ నిర్ణయం తీసుకున్నారు. నైజీరియా, గాబన్‌ దేశాలలో నియంత్రణ వ్యవస్థల అనుమతులను కూడా త్వరలో పొందుతామని రెండు సంస్థ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. నైజీరియాలో జెయిన్‌ మైనార్టీ పార్ట్‌నర్‌ ఎకోనెట్‌ నుండి జెయిన్‌ వివాదం ఎదుర్కొంటోంది. కాగా దక్షిణాఫ్రికాలోని 15 దేశాలలో త్వరలోనే అన్ని అనుమతులు సాధిస్తామని మిట్టల్‌ భరోసా వ్యక్తం చేశారు.

నానో కారుతో డ్రైవింగ్ కొంచం జాగ్రత్త సుమా..!!

చౌక ధరకు వస్తుందని నానో కారును కొనుగోలు చేసేందుకు దేశ పౌరులు అధిక ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఈ కారును ఇప్పటికే కొనుగోలు చేసిన వినియోగిస్తున్న యజమానుల బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అల్లాడుతున్నారు.

ఇటీవలి కాలంలో నానోకార్లు అగ్నిప్రమాదానికి గురవుతున్న సంఘటనలు దేశ వ్యాప్తంగా వినొస్తున్నాయి. ఈనెల 15వ తేదీన ముంబైలో జరిగిన ప్రమాదానికి ముందు మూడు నానో కార్లు ఇదే తరహాలో వివిధ ప్రాంతాల్లో ప్రమాదానికి గురయ్యాయి. అయితే, ఈనెల 15వ తేదీన జరిగిన ప్రమాదమే ఎక్కువ నష్టాన్ని కలిగించింది.

ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలి బూడిదైపోయింది. అందుకే నానో కారును డ్రైవింగ్ చేసే సమయంలో అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలని నానో వినియోగదారులు సలహా ఇస్తున్నారు. ఫలితంగా నానో కారు భద్రతపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.

గతంలో జరిగిన తొలి ప్రమాదాన్ని సాంకేతిక లోపంగా చిత్రీకరించారు. ఆ తర్వాత జరిగిన ప్రమాదాలకు ఇదే కారణాన్ని టాటా యాజమాన్యం చెప్పజాలదని వినియోగదారులు వాపోతున్నారు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో నానో కారును పూర్తిగా పరీక్షించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు.

ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి, భద్రతా ప్రమాణాలపై తనిఖీ చేయాలని వారు కోరుతున్నారు. అంతేకాకుండా, ఇప్పటి వరకు డెలివరీ చేసిన నానో కార్లను రీకాల్ చేసి పరీక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వినియోగదారులు కోరుతున్నారు.