ఇంకా ఐదురోజులలో దసరా మొదలవబోతోందికద అందుకే నేను మీకు దసరా విశేషాలు, పూజ విధానాల రకాలు తెలియజేయాలని అనుకుంటూన్నానండి.
దీనిలో భాగంగానే నేను ఒక టపా రాసాను. అందరు చదివే ఉంటారు అనుకుంటున్నాను.
దసరా
ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ ‘దసరా‘ అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విద్యార్ధులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో, పూర్వం రాజులు ఈశుభ ముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది.
ఈ దసరా సమయంలో ఆ అమ్మవారిని పదిరోజులు పది రూపాలలో మ
నం కొలుస్తాం. అన్నపూర్ణా దేవి, బాల త్రిపుర సుందరి, దుర్గా దేవి, గాయత్రీ దేవి, లలితా త్రిపుర సుందరి దేవి,
మహా లక్ష్మి దేవి, మహా సరస్వతి దేవి, మహిషాసురమర్ధిని దేవి ,
రాజరాజేశ్వరి దేవి రూపాలలో మనం ఈ దసరాలలో అమ్మవారిని పుజిస్తాము. ఈ నవరాత్రులలో
ఏదో తెలియని ఉత్సాహము, ఉల్లాసముతో ఇళ్లన్నీ కళకళలాడుతుంటాయి. ఇక అమ్మవారి ప్రశస్తి చెప్పనలవికాదు.
‘శమీపూజ’ చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే ‘జమ్మిచెట్టు’. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది, శమీవృక్ష రుపమున ఉన్న ‘అపరాజితా’ దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయము సాధించినారు.
కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరవాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరవాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు.
శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ ‘అపరాజితా’ దేవిని పూజించి, రావణుని సహరించి, విజయము పొందినాడు.
తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం ‘పాలపిట్ట’ను చూచే ఆచారం కూడా ఉన్నది.
మేము కూడా చిన్నప్పుడు పాలపిట్టను చూసి వచ్చే వాళ్ళము. తెలంగాణ ప్రాంతంలో దసరా సమయంలో బతుకమ్మ ఉత్సవాలు చేస్తారు.
ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.
శ్లో” శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||
అంతేకాకుండా విజయ దశమి రోజున షిర్డీ సాయిబాబా సచ్చరిత్ర ఒకసారి పారాయణ చేయాలంటారు. మొత్తం పారాయణ చేయలేకపోతే కనీసం ఒక్క సర్గ అయిన చదివేతే మంచిది. విజయ దశమి బాబాకి ఎంతో ఇష్టమైనరోజు. అందుకే ఆరోజున షిర్డీ అంతా జనసందోహంతో నిండిపోతుంది.