యూరప్ దేశాల్లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా దేశీయంగా పసిడి ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర 19 వేల రూపాయలు పలుకుతోంది. యూరో సంక్షోభంతో పాటు దేశంలో పెళ్లిళ్ల సీజన్ ఆరంభంకావడంతో బంగారం ధరలకు మరింత రెక్కలు రానున్నాయి. మున్ముందు పది గ్రాముల బంగారం ధర 20 వేల రూపాయలకు చేరవచ్చని పసిడి వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
యూరో ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా పెట్టుబడిదారులు తమ నగదు రక్షణకు భరోసా ఉండే ప్రాంతంలో పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వాటిలో బంగారం కొనుగోలుపై వారు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో దేశ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైన విషయం తెల్సిందే.
దీంతో అనేక మంది షేర్ హోల్డర్లు, పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లో తమ నగదును ఉపసంహరించుకుని బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. వచ్చే 15 రోజుల పాటు పది గ్రాము బంగారం ధర రూ.18000-19000 మధ్యలో ఉండవచ్చని ఎస్ఎంసి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ జైన్ తెలిపారు. అయితే, యూరో జోన్లో పరిస్థితి చక్కబడని పక్షంలో వీటి ధర రూ.20 వేలకు చేరవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.