ఒక టీస్పూన్ తేనెకు గుడ్డులోని తెల్లసొన, గ్లిజరిన్ రెండు టీస్పూన్ల చొప్పున కలిపి.. చివరగా దానికి శెనగపిండి చేర్చి బాగా కలపాలి. దీన్ని ముఖానికి ప్యాక్ వేసుకున్న పదిహేను నిమిషాల తర్వాత తొలగించి శుభ్రం చేసుకోవాలి. అలాగే గుడ్డులోని తెల్లసొనను ముఖానికి పట్టించండి. ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేస్తే.. వదులైన చర్మం గట్టిపడి, మృదువుగా మారుతుంది. అరకప్పు పుల్లటి పెరుగును చర్మానికి రాసుకుని మర్దనా చేయండి. ఇరవై నిమిషాల తరువాత వేడినీటితో కడిగేయాలి.
ఇలా చేస్తే ముఖం కోల్పోయిన తేమను పొందుతుంది. పొడిబారిన చర్మతత్వానికి ఇది చక్కగా పనిచేస్తుంది. తేనె రాసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. తేనె చర్మానికి సహజ మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. అరకప్పు ద్రాక్షపండ్ల గుజ్జుకు మూడు టీస్పూన్ల నిమ్మరసం, ఒక టీస్పూన్ యాపిల్గుజ్జు, పావు కప్పు గుడ్డులోని తెల్లసొన కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
ఈ ప్యాక్ జిడ్డుచర్మతత్వానికి చక్కగా పనిచేస్తుంది. అలాగే గింజల్లేని టమోటా గుజ్జు పావు కప్పు, కీరదోస గుజ్జు ఒక టీస్పూన్, ఓట్మీల్ పొడి 4 టీస్పూన్లు, పుదీనా మిశ్రమం ఒక టీస్పూన్ తీసుకుని బాగా కలిపి ప్యాక్ వేసినా ఫలితం ఉంటుంది. ఇలా చేస్తే చర్మంపై ఉండే జిడ్డు తొలగిపోయి కాంతివంతం అవుతుంది.