అబ్బా ఈ ఎండల్లో తిరిగి తిరిగి చర్మం కమిలిపోతోందమ్మా. అందరి సమస్యా ఇదే ఎండాకాలంలో. పనుల రీత్యా బయటకు తిరగడం తప్పనిసరి. కాలు బయట పెట్టిన క్షణం నుంచే సూర్యకిరణాల దాడి మొదలౌతుంది. ఈ మధ్య కాలంలో వేడి ఎంతగా పెరిగిపోయిందంటే సూర్యకిరణాలు చేతిపై, కాలిపై పడుతుంటే వేడైన, వాడైన సూదులతో గుచ్చుతున్న అనుభూతి కలుగుతోంది. ఇలాంటి ఎండల వల్ల చర్మం నల్లగా మారి కాంతిహీన మవ్వడమే కాకుండా, సహజమైన తేమను కోల్పోయి వికారంగా తయారు అవుతుంది.
ఎన్నో క్రీములు, లోషన్లు, సన్ప్రొటెక్టర్లు వాడినా లాభం శూన్యం.అతినీలలోహిత కిరణాలు చర్మంలోకి చొచ్చుకుపోయి చేయాల్సిన హాని చేసేస్తుంటాయి. అందుకే ఈ ప్రభావం నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేయాల్సిందే. ఎండలో వెళ్లేటప్పుడు గొడుగు తీసుకువెళ్లడం, బైక్‌పై ప్రయాణించేవారు హెల్మెట్, గ్లౌసెస్ ధరించడం వంటి సాధారణ జాగ్రత్తలు తప్పని సరిగా పాటిస్తూనే ఎండ తాపానికి గురైన చర్మానికి చికిత్సను కూడా తీసుకోవాలి. అది ఎలాగో చూడండి.
ఎండలోనించి రాగానే పదినిమిషాలు శరీరానికి విశ్రాంతినివ్వండి. ఆ తరువాత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోండి. శెనగపిండిలో కాస్త గంధం పొడి కలిపి ఎండ ద్వారా బాధింపబడ్డ ముఖం, చేతులు, పాదా లపై అప్లై చేసి, పావుగంట తరువాత చల్లని నీటితో కడిగేయండి.శెనగపిండి పేరుకున్న మురికిని తొలగిస్తే గంధం చర్మానికి చల్లదనాన్ని ఇస్తూ కోల్పోయిన మెరుపు తిరిగి సంతరించుకునేలా చేస్తుంది. రోజూ వంట సమయంలో టమాటాలు, బంగాళ దుంప, కీర, దోస, బీట్రూట్ వంటి కూర గాయలు తరుగుతుంటాం కదా. అలా తరిగే టప్పుడే రెండు ముక్కలను తీసుకుని ముఖానికి, చేతులకు, మోచేతులకూ రుద్దండి. బాగా ఆరాక సబ్బులేకుండా నీళ్లతో శుభ్రంగా కడుక్కోండి. ఈ కూరగాయల్లో సహజంగా ఉండే నీరు చర్మాన్ని తేమగా ఉంచేందుకు సహకరిస్తుంది. చర్మం మృదువుగా అయ్యేలా చేస్తుంది.
పాలమీగడలో గంధం కలిపి ఎండకు వాడిన చర్మంపై రాసి అరగంట తరువాత సబ్బుతో ముఖాన్ని కడిగితే కమిలిన చర్మం తిరిగి మామూలుగా మారుతుంది. ఇది కమలాల సీజన్. తాజా కమలా తొక్కను మిక్సీలో పేస్ట్ చేసి ముఖానికి చేతులకూ రాసి చల్లటి నీటిలో కడిగేసినా మంచి ఫలితం ఉంటుంది. ఎండల్లో చర్మాన్ని చల్లబరిచే ఏకైక సాధనం గంధం. వీలైతే గంధపు చెక్కను అరగదీయగా వచ్చిన గంధాన్ని ముఖానికి లేపనంగా పూసుకోవడం అన్నిటికన్నా ఉత్తమం. రసం తీసేసిన నిమ్మ చెక్కపై ఉప్పు లేదా పంచ దార వేసి అది కరిగే వరకూ మెడ, ముఖం, చేతులపై రుద్దితే ఎండ ప్రభావానికి లోనైన చర్మం తిరిగి ఉత్తేజితం అవుతుంది.
యాపిల్, బొప్పాయి, కమలా పండ్ల గుజ్జుతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే సహజమైన క్లెంజిగ్లా పనికొస్తాయి. చర్మానికి నిగారింపును ఇస్తాయి.ఎండలో తిరిగి వచ్చిన వెంటనే చర్మం అంతా కాలుతున్న అనుభూతికి లోనౌతుంటుంది. అలాంటప్పుడు చెంచాడు తేనె తీసుకుని వేడి అనిపిస్తున్న ప్రాంతంపై సున్నితంగా అప్లై చేయండి. కాసేపు ఆరాక కడిగేయండి. ఇలాం టప్పుడు గంధం కూడా ఉపయోగించవచ్చు. వీటితోపాటు మంచినీళ్లు, కొబ్బరినీళ్లు, బార్లీ, సబ్జానీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. శరీరంలో గ్లూకోజ్ శాతం తగ్గకుండా చూసుకోవాలి.సీజనల్ పండ్లు తీసుకోవాలి. ఆహారం విష యంలో జాగ్రత్తలు తీసుకోవాలి.చూసారుగా మన ఇంట్లోనే ఎండతాకిడి నుండి చర్మాన్ని కాపాడే రక్షణ కవచాలు ఎన్ని ఉన్నాయో. రసాయనాలతో నిండిన ఇతర ప్రోడక్ట్‌ల కన్నా ఇవి ఎంతో మేలైనవి. హాని చేయనివి. ఈ రోజే మీరు ప్రయత్నిస్తున్నారా!
మీ బ్లాగ్ చాలా బాగుంది