వేసవితాపం భరించలేక వడదెబ్బకు గురయ్యేవారు పచ్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక గ్లాసు నీటిలో వేసి.. దాంట్లోనే కాస్త చక్కెర వేసి బాగా కలపాలి. కాసేపటి తరువాత ఈ ద్రవాన్ని తాగినట్లయితే వడదెబ్బ బారినుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే పచ్చి మామిడి ముక్కలపై కాస్త ఉప్పు వేసి తినటంవల్ల అధిక దాహాన్ని అరికట్టడమేగాకుండా.. చెమట ద్వారా శరీరంలోని లవణాలు, రక్తంలోని ఐరన్ తదితరాలు బయటకు పోకుండా ఆపుతుంది.
వేసవిలో సంభవించే డయేరియా, రక్త విరేచనాలు, పైల్స్, వికారం, అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలకు టెంక పూర్తిగా ఏర్పడని పచ్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటికి ఉప్పు, తేనెను కలిపి తింటే అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుంది. ఇంకా.. పచ్చి మామిడికి మిరియాలు, తేనె కలిపి తిన్నట్లయితే.. జాండీస్ (పచ్చ కామెర్లు) వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. అంతేగాకుండా మామిడి గుండెకు మంచి టానిక్‌లాగా పనిచేస్తుంది.
పచ్చి మామిడికాయలో విటమిన్ సీ పుష్కళంగా లభిస్తుంది. గుండె కండరాలను బిగుతుగా చేసే శక్తి మామిడికి ఉంది. అలాగే చర్మాన్ని మిలమిలా మెరిసేలా చేసే శక్తి కూడా దీనికి అధికంగా ఉంది. అయితే అతి అనేది అన్ని వేళలా సరికాదు కాబట్టి.. ఎక్కువ మోతాదులో పచ్చిమామిడిని తినకూడదు. అలా తిన్నట్లయితే ఆర్ధరైటిస్, కీళ్లవాతం, సైనసైటిస్, గొంతునొప్పి, అసిడిటీ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మామిడిని పరిమితంగా తినటం మంచి పద్ధతి.