కేజీ బేసిన్లో ఒఎన్‌జిసి చేపట్టిన చమురు అన్వేషణలో పాల్గొనరాదని నార్వే కంపెనీ స్టాట్ ఆయిల్, బ్రెజిల్ కంపెనీ పెట్రోబ్రాస్ నిర్ణయించాయి. ఈ అన్వేషణలో తమ రెండు కంపెనీల పాత్రపై భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో చాలా జాప్యం జరుగుతున్నందున ఈ రెండు కంపెనీలు ఈ నిర్ణయానికి వచ్చాయి.
పెట్రోబ్రాస్ బ్రెజిల్ ప్రభుత్వరంగ సంస్థ. కేజీ బేసిన్లో తనకు ఉన్న 15 శాతం వాటాను ఒఎన్జిసికి ఉచితంగా ఇవ్వడానికి సంసిద్ధతను వ్యక్తంచేసింది. ఈ చమురు క్షేత్రం కేజీ -డి6 రిలయన్స్ ఇండస్ట్రీస్ క్షేత్రం పక్కన ఉన్నది. ఆంధ్రాకోస్తాలో భవిష్యత్తు డ్రిల్లింగ్ కార్యకలా పాల్లో పాల్గొనరాదని స్టాట్ ఆయిల్ నిర్ణయించింది. పెట్రోలియం శాఖ, డిజిహెచ్ విదేశీ కంపెనీలు వాటా ధనాన్ని సమకూర్చ డానికి అయిష్టంగా ఉన్నాయి.
అందువల్లనే డ్రిల్లింగ్ కార్యక్రమానికి అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నాయి. ఒఎన్‌జిసి తాను స్వయంగా ఈ చమురు క్షేత్ర అన్వేషణ జరిపి చమురు, గ్యాస్ లభ్యం అయితే వాటిని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 14 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ రిజర్వులు ఉన్నట్లు అంచనా. సముద్రంలోతైన ప్రాంతాల్లో గ్యాస్‌ను ఉత్పత్తి చేసే టెక్నాలజీ ప్రస్తుతం ప్రభుత్వరంగ సంస్థకు లేదు. కేజీ బేసిన్లో గ్యాస్ అన్వేషణ కొంచెం క్లిష్టమైన కార్యక్రమం.
దీనిపై ఒఎన్‌జిసి సిఎండి ఆర్ఎస్ శర్మ చమురు శాఖ కార్యదర్శికి ఒక లేఖ రాసినట్లు తెలుస్తున్నది. తాము వాటా తీసుకున్న చమురు క్షేత్రాల్లో అన్వేషణ కార్యక్రమంలో పాల్గొనడానికి అంతర్జాతీయ కంపెనీలు వెనుకాడుతున్నాయని, దీనికి ప్రభుత్వంలో రెడ్టేప్జిం కారణమని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. 2007 సంవత్సరంలో ఒఎన్‌జిసి కేజీ బేసిన్ చమురు క్షేత్రాల్లో 15 శాతం వాటా పెట్రోబ్రాస్కు పది శాతం వాటా స్టాట్ ఆయిల్‌కు ఇచ్చింది. ఈ అంతర్జాతీయ కంపెనీల సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియో గించుకోవడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఒఎన్‌జిసి సిఎండి తన లేఖలో పేర్కొన్నారు.
ఈ చమురు క్షేత్రంలో పది చోట్ల గ్యాస్ నిల్వలు ఉన్నట్లు తేలింది. అయితే ఆ నిల్వలు ఏమేరకు ఉన్నాయో తెలుసుకోవడానికి మరింత డ్రిల్లింగ్ జరగాల్సిఉంది. అలా తెలుసుకున్న తర్వాత గ్యాస్ క్షేత్రం అభివృద్ధికి పెట్టుబడులు పెడతారు. కేజీ బేసిన్లోనే కాకుండా కావేరి బేసిన్లో కూడా అంతర్జాతీయ కంపెనీలకు ప్రభుత్వ వైఖరి అడ్డంకులు సృష్టిస్తున్నదని శర్మ తన లేఖలో విమర్శించారు. 2009 జనవరిలో ప్రభుత్వంతో జరగాల్సిన సంతకాలు ఆగిపోయాయని, దీనివల్ల అంతర్జాతీయ కంపెనీల్లో అనుమానాలు ఏర్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ కంపెనీలు వైదొలగడం వల్ల ఒఎన్జిసికి రిస్క్ ఎక్కువ అవుతుందని ఆయన పేర్కొన్నారు. గ్యాస్ ధర, పన్ను రాయితీల విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేకపోవడం పెట్రోబ్రాస్ వైదొలిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో ఉన్న పోటీని తట్టుకోవడానికి ఒఎన్‌జిసి ప్రయత్నిస్తున్నదని, ప్రభుత్వ నిర్ణయాల్లో జాప్యం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయని ఆయన విమర్శించారు.