హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆన్లైన్): నందమూరి కుటుంబ నట వారసుడు, సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ వివాహ నిశ్చితార్థం గురువారం ఉదయం వేడుకగా జరిగింది. దివంగత నట శిఖరం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి నార్నె శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతితో జూనియర్ నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యా భవన్ ఎదురుగా ఉన్న నార్నె నివాస గృహంలో ఈ కార్యక్రమం జరిగింది. గోధుమ రంగు సూట్లో వచ్చిన ఎన్టీఆర్… సరిగ్గా ఉదయం 8.10 గంటలకు ప్రణతికి నిశ్చితార్థ ఉంగరం తొడిగారు. తర్వాత ఆమె కూడా ఆయనకు ఉంగరం తొడిగారు.
నవంబర్ నెలలో హైదరాబాద్‌లోనే వివాహం జరపాలని ఉభయ కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి బాగా దగ్గరి వారిని మాత్రమే ఆహ్వానించారు. సినీ, రాజకీయ రంగాల నుంచి చాలా కొద్ది మంది మాత్రమే వచ్చారు.
ఎన్టీఆర్ తల్లిదండ్రులు శాలిని, నందమూరి హరికృష్ణ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి, కేంద్ర మంత్రి పురందేశ్వరి, సినీ హీరో బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర, నందమూరి రామకృష్ణ, జయకృష్ణ, ఉమామహేశ్వరి, ఈశ్వరి, సినీ హీరోలు కళ్యాణ్‌రామ్, తారకరత్న హాజరయ్యారు.
భువనేశ్వరి తదితరులు తెల్లవారు జామున ఐదు గంటలకే వచ్చారు. చంద్రబాబు ఉదయం ఏడున్నర గంటలకు వచ్చారు. ఆయన రాగానే అప్పటికే అక్కడ ఉన్న పురందేశ్వరి వెళ్లిపోయారు. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం ఉండిపోయారు.
రాజకీయ రంగానికి చెందిన చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, కృష్ణా జిల్లా టీడీపీ నేత వల్లభనేని వంశీమోహన్ మాత్రమే వచ్చారు. భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ముత్యాల తలంబ్రాలను, అక్షింతలను ఎన్టీఆర్, ప్రణతికి భట్టి విక్రమార్క దంపతులు బహూకరించారు.
సినీ రంగం నుంచి హాజరైన వారిలో దర్శకులు వీవీ వినాయక్, రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, నిర్మాత నల్లమలుపు బుజ్జి, సినీ నటుడు రాజీవ్ కనకాల తదితరులు ఉన్నారు. ఉదయం అల్పాహారంతో వివాహ నిశ్చితార్థ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమం సందర్భంగా నార్నే శ్రీనివాసరావు గృహాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రముఖులు హాజరు కానుండటంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.