వరుడు

జోశ్యుల సూర్య ప్రకాష్
సినిమా: వరుడు
బ్యానర్: యూనివర్సిల్ మీడియా
నటీనటులు: అల్లు అర్జున్ , భానుశ్రీ మెహ్రా, ఆర్య, ఆశిష్ విధ్యార్ధి, సుహాసిని,
నరేష్, నాసర్, రావు రమేష్, శాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్,
బ్రహ్మానందం, సింగీతం శ్రీనివాస్, అనితా చౌదరి తదితరులు.
సంగీతం: మణిశర్మ
కెమెరా: ఆర్.డి.రాజశేఖర్
మాటలు: తోట ప్రసాద్
ఎడిటింగ్: ఆంధోని
ఫైట్స్: స్టన్ శివ
కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: గుణశేఖర్
నిర్మాత: డివివి దానయ్య
రిలీజ్ డేట్: 31-03-2010

హీరోయిన్ ని విలన్ ఎత్తుకుపోవటం, దాంతో హీరో రెచ్చిపోయి…విలన్ ని తుక్కు చేసి ఆమెను రక్షింపచేయటం లాంటి ఒక్కడు నాటి కాన్సెప్ట్ తోనే వరుడు వచ్చాడు. అయితే ఈ సారి ఐదు రోజుల పెళ్ళి, పదహారు రోజులు పండుగ అని కొద్దిగా బిల్డప్ ఇచ్చి కొత్త కథ అని నమ్మించబోయి తానే బోల్తా పడ్డాడు.అలాగే కథ,కథనంలు లోపంగా వచ్చిన ఈ వరుడులో హీరోయిన్ ని మిస్టీరియస్ గా ఉంచి ఆసక్తి రేపాలని ప్రయత్నం చేసారు. అయితే ఆమె కూడా ఊహించనంత గొప్పగా లేకపోవటంతో అదీ తుస్సుమంది. అయితే అల్లు అర్జన్, ఆర్య నటనలు మాత్రం ఈ సినిమాలో పోటీపోటీగా కనిపించటం విశేషం. ఇక ఐదు రోజుల పెళ్ళి అనే పాయింటు తో వచ్చిన ఈ చిత్రం ఐదు రోజులైనా సక్సెస్ ఫుల్ గా నడుస్తుందా అంటే సందేహమే.

మంచి కుటుంబలో పుట్టి పెరిగిన సందీప్ (అల్లు అర్జున్) పైకి ఆధునికంగా కనిపించినా సంస్కృతి సంప్రదాయాలకు విలువనిస్తూంటాడు.రేపో మాపో అమెరికా వెళ్ళిపోదామనుకుంటున్న అతనికి పెళ్ళి చేద్దామని అతని తల్లి(సుహాసిని), తండ్రి(ఆశిష్ విధ్యార్ధి) నిర్ణయించుకుని ఏమన్నా ప్రేమ వ్యవహారం ఉందా అని అడుగుతాడు. కానీ బుద్ది మంతుడైన సందీప్ అలాంటిదేమీ లేదని ఎరేంజ్ మ్యారేజ్ చెయ్యమంటాడు. అయితే ఐదు రోజులు పాటు పెళ్ళి గ్రాండ్ గా చేయాలని, పెళ్ళి కూతురుని పీటల మీదే చూస్తానని కండీషన్ పెడతాడు. సరేనన్న అతని తల్లి తండ్రులు ఓ అమ్మాయి(భానుశ్రీ మెహ్రా) తో వివాహం నిర్ణయిస్తారు. పెళ్ళి పీటల మీద తొలిసారిగా చూసిన వరుడు సందీప్ ఆమెతో ప్రేమలో పడిపోతాడు. అయితే ఆ సంతోషం ఎంతో సేపు నిలబడదు. ఆ పెళ్ళి మండపం కూలగొట్టి దివాకర్‌ (ఆర్య). అనే విలన్ ఎంట్రీ ఇచ్చి వధువుని ఎత్తుకుపోతాడు. ఆ తర్వాత వరుడు ఆమెను ఎలా తిరిగి వెనక్కి తెచ్చుకుని పెళ్ళి చేసుకున్నాడనేది మిగతా కథ.

మంచి వివాహమే మంచి దాంపత్యం. మంచి దాంపత్యమే మంచి సంతానం. మంచి సంతానమే మంచి సమాజం. మంచి సమాజమే మంచి ప్రపంచం అంటూ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ప్రారంభమవుతుంది ఈ చిత్రం. దాంతో ఏదో గొప్ప మెసేజ్ ఉన్న చిత్రం చూస్తున్నాం అని ఫిక్స్ అవుతాం. అయితే ఆ డైలాగులు ఆచరణలోకి రాకుండా కేవలం మాటలు క్రిందే సినిమాలో ఉండిపోతాయి. ఇక కథ, కథనమే ఈ చిత్రానికి మైనస్ గా నిలిచాయి. హీరోయిన్ ని ఎత్తుకుని విలన్ వెళ్ళిపోతే…హీరో ఎదురు ఎత్తులు వేసి విలన్ ని ఇరికించి ఆమెను రక్షించుకోవటం చేయడు. విలన్ చేష్టలకు ప్రతిగా పెద్ద పెద్ద డైలాగులు చెపుతూ పారిపోతూంటాడు. దాంతో హీరో పాత్ర ప్యాసివ్ గా మారి పూర్తి స్ధాయి బోర్ గా మారింది. అలాగే ఎంతో బిల్డప్ గా చెప్పిన ఐదు రోజుల పెళ్ళి వ్యవహారం కేవలం నామ మాత్రంగా స్క్రీన్ టైమ్ ని తినటానికే తప్ప కథకు ఏ మాత్రం ఉపయోగపడదు. ఆ ఎలిమెంట్ లేకపోయినా కథ నడుస్తుంది. ఇక డైలాగులు అయితే టెక్స్ట్ బుక్ లోవి తెరమీదకు వచ్చినట్లుగా ఉంటాయి.ఇక హీరోయిన్ భాను మెహ్రా అంత రహస్యంగా ఉంచి ప్రెజెంట్ చేయాల్సినంతగా కనిపించదు. అంతేగాక ఆమె నటనకు కొత్తని స్పష్టంగా తెలిసిపోతూంటుంది. ఇక అక్కడక్కడా నవ్వించబోయి బ్రహ్మానందం నవ్వులు పాలవటం బాధ అనిపిస్తుంది. వీళ్ళలో తమిళ హీరో ఆర్య నటనే హైలెట్ అవుతూంటుంది. ఆహుతి ప్రసాద్, సుహాసిని, సింగితం శ్రీనివాసరావు వంటి వారు కూడా పెద్దగా కథకు ఉపయోగపడరు. వీటికి తోడు యాభై నిజమైన కుటుంబాలను ఎందుకు పెట్టారో అర్దం కాదు. జూనియర్ ఆర్టిస్టులైనా ఆ సీన్స్ కు సరిపోతారు. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ లో సిలైన్ ని హీరోయిన్ కి పెట్టి హీరో పరుగెత్తే సీన్ అస్సలు ఎక్కదు. అయినా పెళ్ళి మండపం సెట్ చూస్తుంటే కేరళలలో ఇళ్ళు గుర్తుకు రావటం ఎలా తెలుగు నేటివిటి అనిపించుకుంటుంది. టెక్నికల్ గా ఎడిటింగ్ సోసో గా ఉంది. కెమెరా కొన్ని సన్నివేశాల్లో బాగుంది అనిపించినా చాలా చోట్ల టీవీ సీరియల్ వాతావరణం క్రియేట్ చేసింది. మణిశర్మ సంగీతం ఇంప్రెసివ్ గా లేదు. రెండు పాటలు వినసొంపుగా ఉన్నాయి.

ఏదైమైనా పెళ్ళి సంప్రదాయాలు చూపే సినిమా అంటేరాజశ్రీ వారి హమ్ ఆప్ హై కౌన్ గుర్తుకు వస్తుంది. నిజాయితీగా తమ సంప్రదాయాలను వాళ్ళు ప్రజెంట్ చేసారు. అదే వరుడుకి కొరవడింది. సంప్రదాయాలు పేరు చెప్పి ఓ యాక్షన్ చిత్రం చూపించే ప్రయత్నం చేసారు. ఇక ఈ చిత్రాన్ని చూద్దామని ఇప్పటికే టిక్కట్లు బుక్ చేసుకున్న వారికి ఎలాగో తప్పదు. ఆలా కానివాళ్ళు కేవలం అల్లు అర్జున్ కొత్త చిత్రమని బయిలుదేరాలే…తప్ప ఏ విధమైన ఏగ్జయిటీ కానీ, ఎంటర్టైన్మెంట్ గానీ ఆశించి వెళ్ళటం అనవసరం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s