ఐదవ పెద్ద టెలికాం సంస్థగా అవతరించనున్న ‘భారతీ ఎయిర్‌టెల్‌’

దక్షిణాఫ్రికాలో సేవలందిస్తున్న దుబాయి టెలికాం దిగ్గజం జెయిన్‌ ను, భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థ కొనుగోలు చేయడానికి నిర్ణయించడం దేశ పురోగతికి, ఆర్ధిక సత్తాకు నిదర్శనమని ఇండియన్‌ ఇంక్‌ పొంగిపోతోంది. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన ఒక టెలికాం సంస్థను భారత్‌ కొనుగోలు చేయడం ఇదే ప్రధమమని భారత బ్రాండ్‌ ఈక్విటీకున్న పరిధిని, సమర్ధతను ఇది చాటుతోందని భారత పరిశ్రమలు, వాణిజ్య మండళ్ళ సమాఖ్య (ఫిక్కీ) ప్రధాన కార్యదర్శి అమిత్‌ మిత్రా అభిప్రాయపడ్డారు. దేశీయ పారిశ్రామిక రంగం ఔన్నత్యానికి అద్దం పట్టే ఈ సంఘటన కొత్త కోణాలను ఆవిష్కరిస్తునదని, భారత-దక్షిణాఫ్రికాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత మెరుగు పరుస్తుందని చెప్పారు.

భారత పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు వేణు శ్రీనివాసన్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ విదేశీ మార్కెట్లలో భారత్‌ వేస్తున్న మరో ముందడుగు ఇదని, దీనికి దేశం గర్వపడాలని, దేశంలోని ఇతర కంపెనీలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. 48,000 కోట్ల రూ.లకు భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థ జెయిన్‌ టెలికాంను కొనుగోలు చేయడానికి మంగళవారం జెయిన్‌ ఆఫ్రికా కేంద్ర కార్యాలయమైన ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో సంతకాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో వినియోగదారులున్న ఐదవ పెద్ద టెలికాం సంస్థగా భారత ఎయిర్‌టెల్‌ అవతరించనుంది.

భారతీ కంపెనీని స్ఫూర్తిగా తీసుకోవాలి : సాల్మన్‌ ఖుర్షీద్
దేశంలోని అనేక పెద్ద కంపెనీలు భారతీ ఎయిర్‌టెల్‌ను స్ఫూర్తిగా తీసుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి సాల్మన్‌ ఖర్షీద్‌ ఆకాంక్షించారు. ఇంత పెద్ద కొనుగోలు వ్యవహారంలో భారతీ సంస్థ మొదట్లో కొంచెం తడబడినా, కొనుగోలు వ్యవహారాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని ఆయన కొనియాడారు. ప్రపంచస్థాయి భారత కంపెనీల ప్రస్థానంలో ఇది తొలి అడుగువంటిదని అభివర్ణించారు. ఈ కొనుగోలు వ్యవహారంపై భారతీయుడిగా తాను ఎంతో గర్విస్తున్నానని కేంద్ర రెవిన్యూ శాఖ కార్యదర్శి సునీల్‌ మిత్రా పేర్కొన్నారు.

కువాయిట్‌ మార్కెట్లో లిక్విడిటీ పెంచే చర్య
భారతీ ఎయిర్‌టెల్‌, జెయిన్‌ను కొనుగోలు చేయడం దుబాయి మార్కెట్లో లిక్విడిటీని పెంచుతుందని, ఆ సంస్థలో ప్రధాన భాగస్వామి అయిన ఖరాఫీ గ్రూప్‌ అభిప్రాయపడింది. గ్రూప్‌ వైస్‌ ఛైర్మన్‌ బదీర్‌ అల్‌ ఖరాఫీ కువాయిట్‌కు చెందిన అల్‌ వాటన్‌ డైలీకి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న దుబాయి ప్రాంతంలో ఈ కొనుగోలు వ్యవహారం మార్కెట్లో విశ్వాసాన్ని కలుగచేసి లిక్విడిటీని అభివృద్ది పరుస్తుందని చెప్పారు. దుబాయిలో వ్యక్తులు, సంస్థలు ఎక్కువ సంఖ్యలో ఏదో ఒక రకంగా జెయిన్‌తో సంబంధం ఉన్నవారేనని, కాబట్టి ఈ వ్యవహారంలో వారంతా లబ్ది పొందుతారని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో ఏ మంచి అవకాశం తనముందుకు వచ్చినా, ప్ర పంచస్థాయి సంస్థగా జెయిన్‌ దాని వదులుకోబోదని ఆయన వ్యాఖ్యానించారు.

బాగానే లబ్ది పొందాం : జెయిన్‌
క్రయ, విక్రయాలకు సంబంధించి జెయిన్‌ టెలికాం, భారతీ ఎయిర్‌టెల్‌ సంతోషంగానే ప్రతిస్పందించాయి. ఈ కొనుగోలు వ్యవహారంలో తాము 3.3 బి.డాలర్ల నుండి 10.7 బి.డాలర్లకు లబ్ది పొందామని జెయిన్‌ ప్రకటించగా, కొనుగోలుకు మంచి ధరనే చెల్లించామని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. కువైట్‌ స్టాక్‌ ఎక్చేంజ్‌కు జెయిన్‌ రాసిన లేఖలో సుడాన్‌, మొరాకో మినహా మిగిలిన దక్షిణాఫ్రికా వైర్‌లైస్‌ వ్యాపారాన్ని ఎయిర్‌టెల్‌కు విక్రయించినట్లుగా పేర్కొంది. ఈ డీల్‌పై సంతకం కాగానే భారతీ ఎయిర్‌టెల్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ స్పందిస్తూ ఈ కొనుగోలు వ్యవహారంలో తాము పూర్తి సౌకర్యంగా ఉన్నామని, మంచి ధరను వెచ్చించామని సంతృప్తి వ్యక్తం చేశారు.

జెయిన్‌ సంస్థను కొనుగోలు చేయడానికి భారతీ ఎయిర్‌టెల్‌ 8.3 బిలియన్‌ డాలర్లను రుణంగా పొందింది. 700 మి.డాలర్ల ఏడాది తరువాత చెల్లించడానికి ఒప్పం దం కుదుర్చుకుంది. తన ఖాతాలలో 1.7 బి.డాలర్లను రుణంగా చూపించింది. తమ ఆస్తి అప్పుల పట్టీ మీద ఈ భారీ రుణం ప్రభావితం చూపిస్తుందా అని పిటీఐ అడిగిన ప్రశ్నకు సునీల్‌ మిట్టల్‌ స్పందిస్తూ రుణం తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తామని, అందుకు చాలా సమయం ఉందని, పైగా తాము ఆర్ధికంగా పటిష్టంగా ఉన్నామని చెప్పారు. భారతీ-జెయిన్‌ డీల్‌ వ్యవహారంపై మదుపరులు కూడా హుషారుగా స్పందించారు.

భారతీ ఎయిర్‌టెల్‌ షేర్ల ధరలు మూడు శాతం పైకెగిశాయి. ఆయా దేశాలలో నియంత్రణ వ్యవస్థల ఆమోదం పొందడానికి ఈ సంస్థలు ఇక ప్రయత్నిస్తాయి. ఆఫ్రికన్‌ వ్యాపార వ్యవహరాలను సంస్థ జెఎండి, సిఇవో ఇంటర్నేషనల్‌ మనోజ్‌ కోహ్లీకి అప్పగిస్తూ మిట్టల్‌ నిర్ణయం తీసుకున్నారు. నైజీరియా, గాబన్‌ దేశాలలో నియంత్రణ వ్యవస్థల అనుమతులను కూడా త్వరలో పొందుతామని రెండు సంస్థ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. నైజీరియాలో జెయిన్‌ మైనార్టీ పార్ట్‌నర్‌ ఎకోనెట్‌ నుండి జెయిన్‌ వివాదం ఎదుర్కొంటోంది. కాగా దక్షిణాఫ్రికాలోని 15 దేశాలలో త్వరలోనే అన్ని అనుమతులు సాధిస్తామని మిట్టల్‌ భరోసా వ్యక్తం చేశారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s