రోజు రోజుకూ ఎండలు మండిపోతున్నాయి. వచ్చే ఏఫ్రిల్, మే నెలలో భానుడి ప్రతాపం మరింతగా పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే ఎండ ప్రభావంవల్ల వచ్చే వడదెబ్బ నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా సూర్యతాపాన్ని తగ్గించటంలో పండ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. అలాంటి పండ్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
ద్రాక్షపండ్లు: ఈ పండ్లు వేసవిలో శరీరానికి ఎంతగానో మేలు చేకూరుస్తాయి. ఎండలకు శరీరం నుంచి సోడియం ఎక్కువగా చెమట రూపంలో బయటకు వెళుతుంది. అలాంటి సమయాలలో ద్రాక్షపండ్లను ఎక్కువగా తీసుకుంటే శరీరానికి తగినంత సోడియంను అందించి సత్వర శక్తిని అందిస్తాయి.
పుచ్చకాయ: వేసవిలో సామాన్యూడి నుంచి సంపన్నులవరకూ అందుబాటులో ఉండే చక్కని పండు పుచ్చకాయ. 80 శాతం నీరు కలిగిన పుచ్చకాయను తీసుకుంటే శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చే పుచ్చకాయను తినటంవల్ల శరీరానికి ఎంతో ఉల్లాసం కలుగుతుంది. శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.
ఫైనాఫిల్: వేసవిలో శరీరంలో ఏర్పడే అధిక బరువును ఫైనాఫిల్ (అనాస పండు) ద్వారా తగ్గించవచ్చు. ఫైనాఫిల్ బరువును తగ్గించటమేగాకుండా, తినే ఆహారం సాఫీగా జీర్ణమయ్యేలా జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. వేసవిలో వచ్చే పలు రకాల వ్యాధులకు ఇది విరుగుడుగా కూడా పనిచేస్తుంది.
బత్తాయి, నిమ్మ: బత్తాయిలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. బత్తాయి రసం తాగటంవల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బత్తాయి రసాన్ని వేసవిలో క్రమం తప్పకుండా ప్రతిరోజూ, ఒక్కపూటైనా తీసుకోవటం మంచిది. అలాగే ఎండాకాలం నిమ్మరసం ఎంత తీసుకుంటే అంత మంచిది. వేసవిలో రోజుకు రెండుసార్లు నిమ్మరసంలో ఉప్పు వేసుకుని తాగితే ఉష్ణోగ్రత తగ్గుతుంది. వేసవిలో వచ్చే వ్యాధులను దూరం చేస్తుంది.
కొబ్బరిబోండాం : కొబ్బరి నీళ్లలో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం కలగలిసిన ఆరోగ్యకరమైన సహజ పానీయం ఇది. విటమిన్లు, తీపి, ఖనిజ లవణాలు, సహజసిద్ధమైన ద్రవపదార్థం.. వీటితోపాటు ఇతర పోషక విలువలు ఇందులో పుష్కళంగా ఉంటాయి. కొబ్బరినీళ్లు ఎండతాపం నుంచి పెరిగే శరీర ఉష్ణోగ్రత శాతాన్ని తగ్గిస్తుంది.
మజ్జిగ : పెరుగు నుంచి తీసిన మజ్జిగలో కొవ్వుశాతం తక్కువగా ఉంటుంది. క్యాల్షియంతోపాటు పాస్పరస్ ఎక్కువగా ఉంటుంది. వేసవిలో రోజుకు రెండుసార్లు అంతకంటే ఎక్కువసార్లు ఉప్పు కలిపి తీసుకుంటే వడదెబ్బ నుంచి ఉపశమనం పొందవచ్చు. భోజనంలోనూ పెరుగు మజ్జిగతో తీసుకుంటే శక్తి తీసుకున్న ఆహారం కూడా జీర్ణం బాగా అవుతుంది.
పండ్లను విరివిగా తీసుకోవటంతోపాటు.. దుస్తుల విషయంలో కూడా కాస్తంత జాగ్రత్త పాటిస్తే వేసవిని కూల్ కూల్‌గా గడిపేయవచ్చు. వేసవిలో శరీరానికి చెమట ప్రభావం అధికంగా ఉంటుంది. సూర్యరశ్మి ప్రభావం ఇతర దుస్తులపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, తెల్లటి కాటన్ దుస్తులు ధరించినట్లయితే ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు. శరీర భాగాలకు గాలి తగిలేందుకు తెల్లటి కాటన్ దుస్తులు ఎంతో ఉపకరిస్తాయి.
తలపై టోపీలు, గొడుగులు ధరించటం మూలంగా వేసవితాపం నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. తలభాగం చల్లగా ఉండే అవకాశం ఉంటుంది. ఎండవేడిని తట్టుకునేందుకు ఇవి చాలా ఉపయోగపడతాయి. చల్లని కళ్లజోళ్లు కూడా సూర్యరశ్మి నుంచి కళ్లను రక్షించుకునేందుకు ఉపయోగపడతాయి.
good info