గుక్కెడు మంచినీటికోసం అలమటిస్తున్న ప్రజలు!..

జీవుల ప్రాణం నిలిపే ప్రధాన వనరు నీరు. అటువంటి నీటిని ఎలా వినియోగించుకోవాలో, శుభ్రమైన నీటి కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలో తెలియజెపుతూ ప్రతి యేటా మార్చి 22వ తేదీనాడు అంతర్జాతీయ జల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా ప్రపంచ జలదినం కొన్ని ప్రత్యేక అంశాలతో ముందుకు వస్తుంటుంది. ఈ ఏడాది కూడా కొన్ని కీలక అంశాలను ప్రజల ముందుకు తెచ్చింది.

మానవుల ఆరోగ్యమైన జీవనానికి అవసరమైన నీటిని కలుషితాలు లేకుండా శుద్ధమైన జలాన్ని ఏ విధంగా పొందాలో తెలియజేయాలని కోరుతోంది. ఇందుకుగాను అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రపంచంలోని ఆయా దేశాలకు పిలుపునిస్తోంది.

పరిశుద్ధమైన నీటిని ప్రజలకు అందించే బాధ్యత కేవలం ప్రభుత్వాలదే కాదని అంటోంది. స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీలు, వ్యక్తిగతంగా కూడా పరిశుభ్రమైన నీటికోసం చేపట్టవలసిన చర్యలను ప్రజలకు తెలుపాలని సూచించింది. భూగర్భ జలాలు అడుగంటుతూ పర్యావరణం కలుషితమవుతున్న ప్రస్తుతం తరుణంలో మరిన్ని చర్యలు అవశ్యమని పేర్కొంది. పరిశుభ్రమైన నీటిని వినియోగించని కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో చిన్నారులు, ప్రజలు ప్రాణాలు కోల్పుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో వెల్లడించింది.

ఇదిలా వుండగా మానవుల వికృత చేష్టల వల్ల ప్రపంచవ్యాప్తంగా నీరు తన పరిశుభ్రతను కోల్పోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. కళ్లాలే లేకుండా పెరిగిపోతున్న జనాభా, శరవేగంగా విస్తరిస్తున్న నగరాలు, రకరకాలు రసాయన పరిశ్రమలు… వంటివన్నీ కలిసి జల కాలుష్యానికి కారణమవుతున్నట్లు తెలిపింది.

ఇవేమీ పట్టని మానవులు మాత్రం ఈ రోజు గడిచిపోయింది కదా… అనుకుంటూ కాలాన్ని నెట్టుకెళుతున్నారు. నిజానికి కలుషితమైన నీటి వల్ల మనిషి ఆరోగ్యం ఎంత ప్రమాదంలో పడుతుందో వివరంగా చెప్పుకొస్తోంది. త్రాగటానికి, ఇతర అవసరాలకు మనిషికి సగటున 20 నుంచి 40 లీటర్ల నీరు వినియోగమవుతుందని అంచనా. కానీ స్నానానికి, వంటగది పనులకే ఏకంగా 50 లీటర్లను ప్రతి మనిషి వృధా చేస్తున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి.

ఇదిలావుంటే చాలా దేశాల్లోని ప్రభుత్వాలు తమ ప్రజలకు ఇప్పటికీ పరిశుభ్రమైన నీటిని అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అభివృద్ధి పేరుతో జలాశయాలు, ఇతర కాలువలన్నిటినీ కంపెనీలు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నాయని అంటోంది.

పరిశుద్ధమైన నీరు అందకపోవడంతో ఏటా కోట్లమంది ప్రజలు మృత్యువాత పడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం ఏటా 4 బిలియన్ల మంది డయారియా వ్యాధి బారిన పడుతున్నారు. అందులో సుమారు 22 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ఇక్కడ విచారించదగ్గ విషయమేమిటంటే… కలుషిత నీటిని సేవిస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారిలో ఐదేళ్లలోపు చిన్నారులే అధికం.

ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 1.1 బిలియన్ మంది ప్రజలకు పరిశుభ్రమైన నీరు అందటం లేదని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలో అందరూ పరిశుభ్రమైన నీటికోసం కృషి చేయాల్సిన అవసరముందని సూచిస్తోంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s