అమ్మాయిలూ.. అప్రమత్తం..

ప్రపంచంలో మన దేశం అగ్రగామి.. దేశంలో మన రాష్ట్రమే ముందు వరసలో ఉంది. ఇదేదో సాఫ్ట్‌వేర్ ఫీల్డులోనే.. లేక అభివృద్ధిలోనో అనుకోకండి.. ఇది హ్యూమన్ ట్రాఫికింగ్‌లో… ముఖ్యంగా అమ్మాయిల అక్రమ తరలింపులో.. ప్రలోబ పెట్టి.. వ్యభిచార రొంపిలో దింపే విషయంలో.. అందుకే.. అమ్మాయిలూ.. అప్రమత్తంగా ఉండండి..

సెక్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు… పది మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ముగ్గురు విటుల అరెస్ట్.. ఇలా వారంలో మూడు నాలుగు రోజులు ప్రధాన వార్తలు ఇవే ఉంటాయి. ప్రతీ సారి ఏదో ఓ ముఠా గుట్టు రట్టవుతూనే ఉంటుంది. కానీ.. కార్యకలాపాలు మాత్రం ఆగవు. వ్యభిచార రొంపిలోకి దిగుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. పైగా.. హైక్లాస్ సెక్స్ మార్కెట్ రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇటీవల జూబ్లీహిల్స్‌లో అరెస్ట్ అయిన పదిమంది మహిళలే ఇందుకో నిదర్శనం. ఇక్కడ విటులను ఆకర్షించడానికి విదేశాల నుంచి కూడా అమ్మాయిలను తీసుకువస్తున్నారు.

ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను హైదరబాద్‌కు తెస్తున్న ముఠాలు.. రాష్ట్రంలోని యువతులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఓ రకంగా ఈ బిజినెస్‌కు.. హైదరాబాద్ ప్రధాన హబ్‌గా మారింది. ఇక్కడి నుంచే దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలకు హ్యూమన్ ట్రాఫికింగ్ కొనసాగుతోంది. దీనికోసం కొన్ని ముఠాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రతీ నెలా కనీసం.. ఇరవై నుంచి ముప్పై మంది.. ఇలా తమ వలలో వేసుకుని ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లిపోతున్నారు. ఇదంతా కూడా అత్యంత పకడ్బందీగా జరుగుతుంది. పేద కుటుంబాలు.. ఆదాయం కోసం ఎదురుచూసేవారిని టార్గెట్ చేసుకొని ముఠా సభ్యులు పని మొదలుపెడతారు. ఢిల్లీ, ముంబైల్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయని చెబుతారు. నెలకు ఇరవై, ముప్పైవేల జీతాన్ని ఆశచూపుతారు. చివరకు.. బ్రోతల్ హౌసుల్లో అమ్మేస్తారు..

అప్పుడప్పుడు పోలీసుల దాడుల్లో .. వీరిలో కొంతమంది దొరికిపోతున్నారు. ఇలా పట్టుబడ్డ మహిళల్లో ఎవరినైనా అడగండి.. అందరూ చెప్పే సమాధానం ఒక్కటే. ఉద్యోగం ఇప్పిస్తామని ఇందులో దింపారని. ఒకసారి ముఠాకు చిక్కాక బయటపడడం చాలా కష్టం. పోలీసుల దాడి చేస్తే తప్ప.. బయటిప్రపంచానికి రాలేరు.

రంగుల వల..
అందమైన మాటలకు అమ్మయిలు సులువుగా పడిపోతారన్న విషయంలో.. రాష్ట్రంలో వెలుగు చూస్తున్న సంఘటనలను బట్టి అర్థమవుతోంది. కళ్లముందు రంగుల చిత్రాన్ని చూపిస్తే.. ఇంటిని వదిలి మరీ వెళ్లిపోతున్నారు. రాష్ట్రంలో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ, తిరుపతిలను కేంద్రంగా చేసుకొని కొంతమంది ఇలానే అమ్మాయిలను వలలో వేసుకుంటున్నారు. విజయవాడలో ఇటీవల పట్టుబడ్డ వంశీకృష్ణ.. ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా ఆరుగురు అమ్మాయిలను వ్యభిచారగృహానికి అమ్మేశాడు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వంశీ విజయవాడ బస్టాండ్  కేంద్రంగా చేసుకుని తన కార్యకలాపాలు నిర్వహించాడు. పల్లెటూరు అమ్మాయిలను ఫాలో అయ్యి.. వలవిసురుతాడు.. కాస్త అందంగా..అంతకు మించి మాటలు నేర్చుకున్న వంశీ గాలానికి చిక్కారు. ఇలా ఆరుగురు అమ్మాయిలను తన వలలో వేసుకున్న వంశీ వారిని ఊర్మిళ అనే మహిళద్వారా.. సెక్స్‌ట్రేడ్‌లోకి దింపేశాడు. ఓ అమ్మాయి ఇలా వ్యభిచారానికి ఒప్పుకోనందుకు మచిలీపట్నం బీచ్‌లో దారుణంగా హతమార్చాడు.

పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ ఇదే తంతు. కాకపోతే.. ఇక్కడ నుంచి అమ్మాయిలను నేరుగా గల్ఫ్ దేశాలకే పంపించేస్తున్నారు. ఉపాధి కోసం వెతుక్కునే మహిళలను టార్గెట్ చేసుకోని కొన్ని ముఠాలు వారిని గల్ఫ్ వెళ్లేలా ప్రోత్సహిస్తున్నాయి. మంచి వేతనం.. వసతి కల్పిస్తామని హామీ ఇస్తాయి. అరబ్ దేశాలకు తీసుకెళ్లి నేరుగా… వేశ్యాగృహాల్లో అమ్మేస్తున్నారు. ఇలా చిక్కుకుపోయిన కొంతమంది ఇటీవలే.. తప్పించుకొని వచ్చి… పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులకు కళ్లు చెదిరే వాస్తవాలు తెలిశాయి. ఈ సెక్స్ రాకెట్‌తో సంబంధం ఉన్న మండపేటకు చెందిన చొల్లంగిశ్రీను, సులేమాన్ హుసేన్, చెన్నై లోని మహమ్మద్ ఇక్బాల్,చందమాబాన్లను.. పోలీసులు వలవేసి పట్టుకున్నారు. ఈ ముఠా బారినపడ్డ మరో ఎనిమిది మంది అమ్మాయిలు దుబాయి వ్యభిచార కేంద్రంలో ఉన్నట్లు తేలింది…

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోనూ ఇద్దరు బాలికలను విక్రయించడానికి ప్రయత్నించిన ఐదుగురిని పోలీసులు ఇటేవలే అరెస్ట్ చేశారు. ఇక్కడి నుంచి చెన్నై తీసుకువెళ్లి.. ఆ తర్వాత సెక్స్ ట్రేడ్‌లోకి దింపుతారు. ఇదంతా.. ఎంతో కాలంగా పెద్ద ఎత్తునే జరుగుతోంది. ఎంతోమంది అమ్మాయిలు.. ఇలా సెక్స్‌ముఠాల చేతికి చిక్కి.. భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు.

భారీ బిజినెస్
ప్రపంచంలోనే అతిపెద్ద బిజినెస్‌గా మారిపోయింది హ్యూమన్ ట్రాఫికింగ్. అందులోనూ.. ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో మనదీ ఒకటి. భారత్‌లో ఏటా 30 లక్షల మంది మహిళలను అక్రమ రవాణా చేస్తున్నట్లు… మహిళా శిశు సంక్షేమ శాఖ చేసిన సర్వేలో తేలింది. ఇందులో సగం మంది బాలికలే కావడం ఆందోళన కలిగిస్తోంది. వరల్డ్‌వైడ్‌గా చూస్తే.. ఏటా ఇలా మహిళల అక్రమరవాణా ద్వారా జరుగుతున్న వ్యాపారం.. 37 వేల కోట్ల రూపాయలు. అందుకే.. ఎంతకైనా తెగిస్తున్నారు. భారత్‌లో అమ్మాయిలను వ్యభిచార గృహాలకు తరలిపోతున్న తీరుపై.. ఐక్యరాజ్యసమితి ఇటీవలే ఓ డాక్యుమెంటరీని తీసింది. దేశం నలుమూలలా ఈ వ్యవహారం ఎలా జరుగుతుందో కళ్లకు కట్టింది..

ముఖ్యంగా.. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, బీహార్, ఒరిస్సా, ఢిల్లీల నుంచే ఎక్కువగా మహిళలను ఇలా తరలిస్తున్నారు. ఇలా ఉద్యోగం ఆశచూపించి తమతో తీసుకెళుతున్న ట్రాఫికర్లు.. వారిని వేశ్యావృత్తిలోకి బలవంతంగా దింపేస్తున్నారు. ఒప్పుకోకపోతే.. నరకం చూపిస్తారు. శారీరకంగా హింసిస్తారు.. తేడా వస్తే.. ప్రాణం తీయడానికీ వెనుకాడరు…
మనదేశంలోనూ వ్యభిచారమే అతిపెద్ద బిజినెస్. ఢిల్లీ, ముంబై, గోవా, కోల్‌కతాల్లో.. వేల సంఖ్యలో సెక్స్ వర్కర్లు ఉన్నారు. మనదేశంలో వ్యభిచారం చట్టబద్దం కాకపోయినా.. చాలాచోట్ల ప్రత్యేకంగా రెడ్‌లైట్ ఏరియాలు ఉన్నాయి. గోవాలోని సెక్స్ వర్కర్లలో 80 శాతం మంది మనరాష్ట్రం వారే అంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే.. మన రాష్ట్రంలోనే కాక.. దేశంలోని ప్రధాన పట్టణాల్లోనూ మన పోలీసులు తరచుగా దాడులు చేస్తున్నారు.

ఇలా ఢిల్లీలో జరిగిన దాడుల్లో దొరికిన అమ్మాయిలను ప్రశ్నిస్తే… అనంతపురం జిల్లాకు చెందినవారిగా తేలింది. అనంతపురం అమ్మాయిలు ఢిల్లీ ఎలా వెళ్లారని కూపీ లాగితే.. పెద్ద వ్యవహారమే బయటపడింది. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కల్పిస్తామని ఆశ చూపిన ఏజెంట్లు వారిని ఢిల్లీ, ముంబైలకు తీసుకువెళ్లి అమ్మేస్తున్నారు. పాస్‌పోర్ట్‌లకు దరఖాస్తు పెట్టుకునే వారిని తెలివిగా ఆకర్షిస్తూ.. సెక్స్‌ముఠాలు సొమ్ము చేసుకుంటున్నాయి. కాస్త లేటుగా దీన్ని గ్రహించిన పోలీసులు.. ఇప్పుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

అందుకే.. ఉద్యోగం ఎవరో ఇస్తారని చెప్పగానే.. వారిని గుడ్డిగా నమ్మకూడదంటున్నారు పోలీసులు. ట్రాఫికింగ్ ముఠాల ఆగడాలపై పెద్దఎత్తున ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే.. ప్రభుత్వ విధానాలవల్లే ఇలా మహిళలు సెక్స్ ముఠాలకు చిక్కుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ట్రాఫికింగ్‌లో చిక్కుకుపోతే.. బయటపడడం చాలా కష్టం. అందుకే.. అమ్మాయిలు ఎంతో అప్రమత్తంగా మెలగాల్సి ఉంది. ఉద్యోగం ఇప్పిస్తామనో.. పెద్ద చదవులు చదివిస్తామనో ఎవరైనా చెబితే.. గుడ్డిగా నమ్మేయకండి. వారివెంట వెళ్లిపోకండి. జీవితాన్ని నాశనం చేసుకోకండి. మీ చుట్టూ ఇలాంటి వారు కనిపిస్తే.. వారి నుంచి అమ్మాయిలను కాపాడండి..

1 thought on “అమ్మాయిలూ.. అప్రమత్తం..

  1. meeru cheppindi aksharala nejam madam , kaani manam em chestunnam evi ari kattadaniki ani ? manam question vesukunte ? edo okati cheyali awareness penchali. batuku nasanam chese sigrate ki undi publicity beer ki undi publicity kaani samajam lo machi penchataniki e hording ledu.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s