సంక్రాంతి

మహా పురుషులు జన్మమెత్తిన రోజులు, దుష్టులు కడతేరిన రోజులు సాధారణంగా మనకు పండుగలయ్యాయి. ఇవి కాకుండా గ్రహసంచారంలో మానవునికి విక్రాంతి ఏర్పడే, మంచి జరిగే పుణ్య దినాలను కూడా పర్వదినాలుగా స్వీకరిస్తున్నాం. సంక్రాంతి ఇటువంటి పర్వమే. సంక్రాంతికి రైతులకు ధాన్య రాశులు ఇంటికి వస్తాయి. ఈ పండుగ రోజుల్లో మహాసందడిగా వుంటుంది. గంగిరెద్దుల నృత్యాలు, హరిదాసుల కీర్తనలు, ముంగిళ్లలో తీరొక్క ముగ్గులు, గొబ్బెమ్మలు- అంతా పచ్చగా దర్శనమిస్తుంది. సంక్రమణమంటే గమనం. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం వల్ల చలిగాలుల నుంచి వెచ్చని రక్షణగా వెచ్చని సంతోషసౌభాగ్యాలు సమకూరుతాయని విశ్వాసం. కనుక ఇది సంక్రాంతి అయింది. సంవత్సర కాలంలోసూర్యుడు పన్నెండు రాశులలో ప్రవేశిస్తుంటాడు. ఈ రకంగా చూస్తే ప్రతి మాసంలో సంక్రాంతి ఏర్పడుతుంది. ఈ నెలలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి ఇది మకర సంక్రాంతి అయింది. పన్నెండు రాశుల సంక్రాంతుల్లోనూ ఆషాఢ మాసంలో వచ్చే కర్కాటక సంక్రమణం, పుష్య మాసంలో వచ్చే మకర సంక్రమణం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. మొదటి సంక్రమణం దక్షిణాయనాన్ని, మకర సంక్రమణం ఉత్తరాయనాన్ని ప్రారంభిస్తాయి. ఉత్తరాయణాన్ని పుణ్యప్రదంగా భావిస్తారు.ప్రళయ స్థితిలో భూమండలం సముద్రంలో మునిగి వుంటే ఆది వరాహ రూపంలో విష్ణువు భూమిని మకర సంక్రాంతి రోజుననే ఉద్ధరించాడంటారు. వామనావతారంలో విష్ణువు బలి చక్రవర్తి శిరస్సుపై కాలు పెట్టి పాతాళానికి తొక్కింది కూడా ఇదే రోజున అని చెప్పుకుంటారు. మహాభారతంలో కురువృద్ధుడు భీష్ముని గురించి తెలియనివారుండరు. ఇతడే దేవవ్రతుడు. గంగాశంతనుల అష్టమ సంతానం. పాండవులంటే మక్కువ మెండే అయినప్పటికీ రాజ్యాధినేత దృతరాష్ట్రుడికి భీష్ముడు అండదండలుగా వుండి కురు సామ్రాజ్యాన్ని రక్షించే కర్తవ్యాన్ని భుజాన మోశాడు. అందుకే భీష్ముడు కురువృద్ధుడు అయ్యాడు. కురు క్షేత్ర సంగ్రామంలో అర్జునుడి బాణాలకు కాయం కూలి అంపశయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి వుండి ఆయువులు విడుస్తాడు. పుణ్యగతులు మకర సంక్రమణ వేళ సంక్రమిస్తాయని, ఈ నెలలో వైకుంఠ ద్వారాలు తెరిచి వుంటాయని, ఈ నెలలో మరణించినవారికి శాశ్వత పుణ్యలోక ప్రాప్తి వుంటుందని నమ్ముతారు. ఈ మాసంలో బలి చక్రవర్తి పాతాళలోకం నుంచి వచ్చి ఇంటింటా ఉత్తరాయన పుణ్యకాలం ప్రాముఖ్యాన్ని పరిశీలిస్తాడట. అన్ని పండుగల కన్నా ఇది ప్రాముఖ్యం గల పండుగ కాబట్టి దీన్ని ‘పెద్ద పండుగ’ అంటారు. మన పెద్దలకు పుణ్యలోకాల్ని ప్రసాదించే పండుగ అయినందున కూడా ఇది పెద్దల పండుగ లేదా పెద్ద పండుగ అయింది.

ఈ రోజులలో స్త్రీలు తెల్లవారు జాముననే లేచి వారి వారి ముంగిళ్లలో రంగవల్లులు తీరుస్తారు. వాటి చుట్టూ వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. తెల్లవారు జాముననే సాతాని జియ్యర్లు, జంగపుదేవరలు, బుడబుక్కల దొరలు, పంబలవాండ్లు, బైనాయుడులు, గంగిరెద్దుల వాళ్ళు ఇంటింటికీ తిరుగుతుంటారు. వారి వారి తీరులలో భక్తి గీతాలు పాడుతూ ఏడేడు జన్మలలో మన ఇళ్ల పెద్దలకు పుణ్యలోకాలు ప్రాప్తించాలని దీవెనలు ఇస్తుంటారు. అన్ని కులాల వారు మకర సంక్రమణ సమయంలో తిలా తర్పణలు విడిచి గుమ్మడి పండ్లను దానం ఇస్తే విష్ణువుకు బ్రహ్మాండాన్ని దానమిచ్చిన ఫలం లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ ఫలం వల్ల పెద్దలు తరిస్తారని నమ్మకం.

ఈ పండుగకు లక్ష్మీదేవికి సంబంధం వున్నదని ఒరిస్సా ప్రజలు నమ్ముతారు. ఆమె పేదలకు వరాలిస్తూ అస్పృశ్యుల ఇండ్లలోకి ప్రవేశించిందట. అప్పుడు జగన్నాథుడు తన సోదరుడైన బలభద్రుని ప్రేరణతో ఆమెను వెలివేశాడట. దీంతో లక్ష్మీదేవి ఏ విధమైన చింత లేకుండా ఈ మార్గశిర, పుష్య మాసాల్లో మరింత మంది బీదల ఇండ్లకు వెళ్లి వరాలు ఇవ్వడం ప్రారంభించిందట. అందువల్లనే ఈ మాసాల్లో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ప్రతి ఇంటి ముంగిట రంగు రంగుల ముగ్గులు పెడతారు. అమె మెత్తని పాదాలు పెట్టేందుకు వీలుగా ఆవుపేడ ముద్దలపై పెద్ద పువ్వులయిన తామర, గుమ్మడి పువ్వులు వుంచుతారు. ఈ మాసంలో గొబ్బి లక్ష్మిని కొలవటం కూడా ఆచారం. గొబ్బి లక్ష్మీ అంటే భూమాతనే. ఆమెను కొలిస్తే బోలెడు సస్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. ఈ పర్వదినం కృష్ణునికి ముఖ్యమైంది కాబట్టి గోపమ్మలు గొబ్బి పాటలు పాడుతూ ఇంటింటికీ వస్తారు.

సంక్రాంతి మూడు రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు భోగి పండుగ. రెండవ రోజు సంక్రాంతి. మూడవ రోజు కనుమ పండుగ (పశువుల పండుగ). భోగి పండుగనాడు కష్టకాలంలో వాడుకున్న చింపిరి చాపలు, విరిగిన కొయ్యలు భోగి మంటల్లో వేసి చలిని ఊరి నుంచి తరిమి వేసి వెచ్చని ఊహలతో భోగభాగ్యాలను చవి చూడటం మొదలు పెడతారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుంది కాబట్టి ఆరోజు కోళ్ల పందాలు, పొట్టేళ్ల పందాలు పెడతారు. ఆనాటి సాయంకాలం పిల్లలపై భోగి పండ్లు పోయడం ఆచారం. భోగిపండ్లుగా రేగుపండ్లను వాడుతారు. వీటినే బదరీ ఫలాలంటారు. ఇవి విష్ణుమూర్తి స్వరూపాలే. పాపలపై ఆ ఫలాలను పోస్తే నిండార విష్ణుమూర్తి కరుణాకటాక్షాలు లభిస్తాయని విశ్విసిస్తారు.

రెండవ రోజు సంక్రాంతి. ఆ రోజు ఆడపడుచులను, అల్లుళ్లను ఆహ్వానించి ఆనందంతో పండుగ జరుపుకుంటారు. మూడవ రోజు కనుమ. ఆ రోజు ఎవరూ ఎక్కడికీ ప్రయాణం చేయరు. ఆ రోజును ఆవులను, గేదెలను, కోడ దూడలను, పెయ్యలను, ఎడ్లను పసుపు కుంకుమలతో అలంకరించి తప్పెట్లు తాళాలతో ఊరేగిస్తారు. ఈ విధంగా సంక్రాంతిని మూడు రోజుల పాటు చూడవారలకు చూడ ముచ్చటగా జరుపుకుంటారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s