మాతృ భాష

సాహిత్యం లోకి ప్రవేశించేముందు భాష అంటే ఏంటి? అది ఎలా పుట్టింది? వంటి విషయాలు కూడా తెలుసుకుని ఆ తర్వాత సాహిత్యంలోకి ప్రవేశించడం ఎంతైనా అవసరం. దాంతోపాటు మన మాతృభాష పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత కూడా మనకుంది కాబట్టి తెలుగు భాష ఎలా ఆవిర్భవించిందీ వంటి విషయాలను కూడ తెలుసుకుని ఆ తర్వాత అసలైన సాహిత్యంలోకి అడుగుపెడదాం. ముందుగా….
భాష అంటే ఏంటి?
మనసులోని భావనను బహిర్గతపరచే సాధనం భాష. స్పష్టమైన ఉఛ్చారణతో అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తికి అర్ధమయ్యేట్లు చెప్పగలగడమే భాషకు నిర్వచనం. భాషకు మాటలతో అవసరం లేదు. సైగల ద్వారా అభిప్రాయాన్ని తెలియజేయడం కూడా భాషే అవుతుంది. ఐతే మానవ జాతి ఆవిర్భావం నాటికీ, ఆధునిక మానవుని ఆవిర్భావం నాటికీ మనిషి అవసరాలలో పెరిగిన మార్పులు, అభిప్రాయ వ్యక్తీకరణలో చోటుచేసుకున్న ఉత్సాహం, ఉత్సుకత, భావోద్వేగాల సమ్మేళనం మాటల ఆవిర్భావానికి కారణభూతమయ్యింది.విశ్వావిర్భావ క్రమంలో ఇదో అద్భుతం. భాష పుట్టకముందున్న మనిషి మనుగడకీ,భాషల ఏర్పాటు తర్వాత మనిషి మనుగడకీ చేతల్లో కొలవలేనంత వ్యత్యాసముంది. అది ఆధునిక మానవునిచే అత్యద్భుత విన్యాసాలు చేయించింది. సరికొత్త ప్రపంచం ఏర్పాటుకు కారణమయ్యింది.
భాష ఎలా పుట్టింది?
భాష ఎలా పుట్టిందనడానికి సరియైన నిర్వచనం లేదు. సమగ్రమైన సిద్ధాంతం కూడా లేదు. కాని ప్రపంచంలో ఇప్పటివరకు దాదాపు 2900 భాషల వరకు ఉన్నాయి. ఒక్క భారతదేశంలోనే 200 వరకు భాషలున్నాయి. వాటిలో ఉత్తర భారత దేశంలోని భాషలను ఆర్య భాషలనీ, దక్షిణ భారతదేశంలోని భాషలను ద్రావిడ భాషలనీ అంటారు.
తెలుగు భాష ఎలా పుట్టింది?
సంస్కృత త్రిలింగ శబ్దభవమైన ప్రాక్రుత తిరిలింగ నుండి లేదా సంస్కృత త్రికళింగ శబ్దభవమైన తి అలింగ (ప్రాక్రుతం) పదం నుండిగానీ లేదా రెండు విధాలుగానూ వచ్చి ఏకరూపతనొందడంవలన కాని “తెలుగు” శబ్దం ఏర్పడి ఉండవచ్చని సొమయాజి గారు తెలిపారు. “తెలుగు” దిగ్వాచి అని వీరు నిరూపించారు. తెలుగు శబ్దమునుండి తెనుగు శబ్దంగాని, తెనుగు శబ్దం నుంది తెలుగు శబ్దం గానీ ఏర్పడి ఉండవచ్చని భాషా వికాసకర్తలు తెలిపారు.
“తలైంగు” జాతి వారి భాష కాబట్టి తెలుంగు అని కొందరి అభిప్రాయం. “తలైంగు” అంటే తల స్థానాన్ని ఆక్రమించినవారు అనగా నాయకులు అని అర్థం.
“తెలుంగు” అంటే తెల్లగా, స్పష్టంగా ఉండే భాష అని మరో భావన ఉంది. “తెన్ను” అంటే దారి కాబట్టి తెనుంగు అంటే దారిలో ఉండే వారి భాష; దారి అంటే ఆర్యులు దక్షిణాపథం అని వ్యవహరించే ప్రాంతం.
“తెన్” నుంచి తెనుగు వచ్చిందని కొందరి అభిప్రాయం. “తెన్” అంటే దక్షిణ దిక్కు. దక్షిణ ప్రాంతానికి చెందిన భాష కాబట్టి “తెనుగు” అయ్యిందని ఎక్కువమంది అంగీకరిస్తున్నారు.
ఐతే “త్రినగ” నుంచి తెనుగు ఏర్పడిందని మరికొందరంటారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, మహేంద్రగిరి అనే మూదు కొండలు గల ప్రదేశంగా “త్రినగ” శబ్దం ఏర్పడిందంటారు.
మరికొందరు మన ప్రాంతనికి పూర్వం త్రిలింగ దేశం అనే పేరుండేదనీ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, దక్షారామం అనే మూడు పుణ్య క్షేత్రాల్లో గల మూడు శివ లింగాల ఆధారంగా త్రిలింగ-తి అలింగ-తెలింగ, తెలుగు అయ్యిందని చెబుతారు.
విద్యానాధుడు అను సంస్కృత కవి మొట్టమొదటిసారిగా “త్రిలింగ” పదాన్ని వాడారు. త్రికళింగ నుంచి తెలుగు పదం వచ్చిందని చిలుకూరి నారాయణరావు గరు అనగా తేనె + అగు = తెనుగు అని గ్రియర్సన్, తలైంగ్ జాతినుంచి తెలుగు ఏర్పడిందని ఖండవల్లి లక్ష్మీరంజనం, తెలుగు శబ్దమే త్రిలింగగా సంస్కృతీకరణకు లోనైందని కొమర్రాజు లక్ష్మణరావు పేర్కొన్నారు. తెళ్+గు = తెలుగు అనే అభిప్రాయం కూడా ఉంది. నన్నెచోడుడు, పాల్కురికి సోమనలు తెనుగును భాషాపరంగా వాడారు.
ఐతే తెలుగు శబ్దం తెనుగు శబ్దానికి రూపాంతరమే అనీ ఈ తెలుగు శబ్దం త్రిలింగ లేదా త్రికళింగ శబ్ద భాగం కాదనీ జి.ఎన్. రెడ్డి నిరూపించారు.
పొర్చుగీసు వాళ్ళు 16, 17 శతాబ్దాలలో హిందువును జెంతూ అని పిలిచేవారు. జెంతూ అంటే అన్య మతస్థుడు. అంటే క్రైస్తవేతరుడు అని అర్ధం. మొట్టమొదట్లో వీళ్ళ వ్యాపారాలు ఎక్కువగా తెలుగువాళ్ళతోనే జరిగేవి కాబట్టి జెంతూలంటే తెలుగు వారు అని స్థిరపడిపోయింది. తెలుగుభాషను వాళ్ళు జెంతూ భాష అని పిలిచేవారు. తమిళ, కన్నడ పుస్తకాల్లోనూ, శాశనాల్లోనూ “వడుగ”, “వడగ”, “తెలింగ”, తెలుంగు” అనే విధంగా పేర్లు కనిపిస్తాయి. ఐతే ఎక్కువగా వాడే పేర్లు మాత్రం ఆంధ్ర, తెలుగు, తెనుగు.
మన తెలుగు భాష వయసెంత?
క్రీ.శ. 1వ శతాబ్దం నాటి శాతవాహన రాజైన హాలుని “గాధా సప్తశతిలో తెలుగు పదాలున్నాయి. కాబట్టి 1వ శతాబ్దం నాటికే తెలుగు ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే తెలుగు భాషకు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. నన్నయకు ముందు వెయ్యి సంవత్సరాలనాటికే తెలుగు ఒక స్వతంత్ర భాషగా విరాజిల్లిందనడానికి శాసనాధారాలున్నాయి. ఐతే నన్నయ ఆ వ్యవహార భాషను సంస్కరించి తెలుగు భాషకు ఓ రూపాన్ని ఇవ్వగలిగాడు.
క్రీ.శ. 200 లోని అమరావతి శిలాశాసనంలోని “నాగబు” పదంలోని “బు” ప్రత్యయాన్ని మొట్టమొదటి తెలుగు అక్షరంగా భాషా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కడప జిల్లా కమలాపురం మండలంలోని ఎర్రగుడిపాడులో చెన్నకేశవస్వామి ఆలయంలో రేనాటి చోళుడైన ధనుంజయుడు వేయించిన శాసనం (క్రీ.శ.575-600) , కలమళ్ళ (క్రీ.శ.575-600) శాసనాలు మొట్టమొదటి శిలాశాసనాలుగా భావింపబడుతున్నాయి. అదేవిధంగా క్రీ.శ. 848లోని పండరంగని అద్దంకి శాసనం, యుద్ధమల్లుని బెజవాడ శిలాశాసనాల్లో పద్యాలున్నాయి.
తెలుగు సాహిత్యంలో శ్రీకృష్ణదేవరాయల కాలమైన 16వ శతాబ్దం స్వర్ణయుగం.
సంస్కృత భాష ప్రాబల్యం నుండి బయటపడేందుకు తెలుగు భాష ఏళ్ళ తరబడి పోరాటం చేయాల్సి వచ్చింది. వైదిక భాషల్నీ, వైదిక భావజాలాన్నీ ప్రతిఘతించడంలో ద్రవిడ జాతులందరికంటే తెలుగువారే ప్రముఖ పాత్ర వహించారు. ఎట్టకేలకు వాడుక భాషను సాధించారు. ప్రస్తుతం వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం మనకు లభ్యమవుతోంది.
“తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు తన స్వీయ గ్రంధమైన ఆముక్త మాల్యదలో తెలుగు భాష గొప్పతనాన్ని కీర్తించాడు.
చోళులు, చాళుక్యుల యుగం నుండి తెలుగు అన్న మాటను పలికించడం, తెలుగు పద్యం కనిపించడం, తెలుగు పాట వినిపించడం జరిగింది.
తెలుగులో 20వ శతాబ్దంలోనే ఎక్కువ సాహిత్యం వచ్చింది. ఇంతకుముందులేని సాహిత్య ప్రక్రియలెన్నో ఈ శతాబ్దంలో వికసించాయి. అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు చెందినవారు రచయితలయ్యారు.
అనేకమంది కవుల కృతులతో ఆంధ్ర భాష అలరారింది. ఆచార్య భద్రిరాజు క్రుష్ణమూర్తి ఆధ్వర్యంలో 1,08,330 పదాలతో కూడిన తెలుగు వ్యుత్పత్తి పదకోశం 8 సంపుటాలుగా ఆంధ్ర యూనివర్సిటిచే ప్రచురించబడింది. ఇంగ్లీషు తరువాత తెలుగు భాషకే ఇంతటి కోశ సంపద ఉంది.
అచ్చ తెలుగు :
అచ్చిక తెలుగు అచ్చ తెలుగు అయ్యింది. తెలుగు మాటల్లో తత్సమాలు, తద్భవాలు ఉంటాయి. తత్సమాలలో సంస్కృత సమాలు, ప్రాకృత సమాలు ఉంటాయి. సంస్కృత సమాలుకాని ఇతర పదాలను అచ్చ తెలుగు పదాలు అంటారు. అంటే ప్రాకృత సమాలు, తద్భవాలు, దేశ్యాలు కలిసి అచ్చ తెలుగు అవుతుంది.
జాను తెనుగు :
ఈ పద బంధాన్ని మొట్టమొదటగా తన కుమార సంభవంలో ప్రయోగించినవాడు నన్నెచోడుడు. జానుతెనుగనగా తేట తెలుగు, స్పష్టంగా తెలిసెడి తెలుగు అని నిఘంటుకారుల అభిప్రాయం. మధురమైన తెలుగు అని జాను తెలుగు గురించి బ్రౌన్ నిఘంటువు వివరించింది. జాను అను పదాన్ని స్పష్టము అనే అర్ధంలో తిక్కన ప్రయోగించాడు. డా.సి. నారాయణ రెడ్డి “ఏది ఒకానొక దుర్బోధక విషయముని కూడా సామాన్య జనులకు సైతం సుబోధకంగా, సుప్రసన్నంగా అందించునో అది జాను తెనుగు” అని వివరించారు.
లిపి :భావాన్ని వ్యక్తం చేయడానికి భాష అవసరం. భాష నాగరికతతోపాటు వృద్ధి చెందుతుంది. ఐతే భాష పుట్టిన చాలా కాలం వరకు ఆ భాషకు లిపి ఉండదు.లిపి ముందుగా రాజ్య వ్యవహారాలకోసం పుడుతుందిగానీ వాజ్ఞ్మయం కోసం కాదు. మాట్లాడే భాషని లిఖితపూర్వకంగా గుర్తించడాన్ని “లిపి” అంటారు. ఒక్కొ భాషకు ఒక్కో లిపి ఉంటుంది. లిపి లేని భాషలూ ఉన్నాయి. మన దేశంలోని భాషా లిపులన్నీ కూడా క్రీ.పూ.250 నాటి “బ్రాహ్మీ” లిపి నుంచి పుట్టినవే. 15వ శతాబ్దందాకా తెలుగు, కన్నడ భాషలకు ఒకే లిపి ఉండేదని తెలుస్తోంది.
ప్రకృతి నుంచి వచ్చిన పదాలు :
మనిషికీ, ప్రకృతికీ సంబంధం ఉంది. అలాగే ప్రకృతికీ మనిషి మాట్లాడే భాషకీ సంబంధం ఉంది. మనిషి తన భావ ప్రకటన కోసం ప్రకృతిని సహజంగా వాడుకుంటాడు. భాషని శక్తివంతంగా మలుచుకోవడానికి ప్రకృతిలోని చెట్లనూ, చేమల్నీ, జంతువులనీ, పక్షుల్నీ ఇలా అన్నింటినీ వాడుకుంటాడు.
ఉదా:
నత్త నడక, వేపకాయంత వెర్రి, చిలక పలుకులు, సొరకాయలు కోయడం మొదలైనవి.
భారతదేశంలో హింది తరువాత ఎక్కువమంది ప్రజలు మాట్లాడే భాష తెలుగు. ద్వితీయ స్థానంలో ఈ అద్వితీయ భాష ఉందంటే కారణం భాషలోని తీయదనం తప్ప మరోటి లేదు.

2 thoughts on “మాతృ భాష

  1. ఆసక్తికరమైన విషయాలతో నడుపుతున్న మీబ్లాగు అభినందనీయము.మీవంటివారు ధార్మికచర్చలకోసం ఏర్పడ్డ
    వందే మాతరం అనే గుంపులో చేర్వలసినదిగా మనవి
    లింక్
    https://groups.google.com/group/vandemaatulam?hl=en

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s