పారిశ్రామిక ఉత్పత్తులు పుంజుకుంటున్న నేపథ్యంలో ఉపాధికల్పనలో ఉత్పత్తుల రంగం ప్రధాన పాత్ర పోషించనున్నది. 2015 సంవత్సరంనాటికి పారిశ్రామిక ఉత్పత్తుల రంగం 2 కోట్ల 79 లక్షల కొత్త ఉద్యోగావకాశలను కల్పించగలదని ఒక అధ్యయనం వెల్లడించింది. ఐతే వ్యవసాయరంగం ఉపాధి కల్పన వాటా తగ్గగలదని ఆ అధ్యయనం అభిప్రాయపడింది. అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(అసోచమ్) ”భవిష్యత్తులో లభించనున్న ఉద్యోగాలు” అన్న పేరిట నిర్వహించిన ఈ అధ్యయనం మొత్తంగా 2015 సంవత్సరంనాటికి 8 కోట్ల 37 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు లభించగలవని ఆంచనావేసింది. ఇందులో పారిశ్రామిక ఉత్పత్తుల రంగంవాటా 32 శాతంగా ఉండగలదన్నది అంచనా. వాణిజ్యం, నిర్మాణ రంగాలు తరువాతి స్థానంలో ఉండగలవని అధ్యయనం పేర్కొంది. ఉత్పత్తుల రంగంలో జౌళి, ఆహారం, బేవరేజెస్, రవాణా పరికరాలు, లోహాలు, తోళ్ళు, యంత్రాల రంగాలలో ఉపాధి అవకాశాలు బాగా పెరగగలవన్నది అశోచం అధ్యయనం అంచనా. వాణిజ్య రంగంలో 2 కోట్ల 46 లక్షల 40 వేల ఉద్యోగాలూ, నిర్మారణంగంలో కోటీ 51లక్షల 30 వేల కొత్త ఉద్యోగావకాశాలు లభించగలవని అధ్యయనం అభిప్రాయ పడింది.
ప్రస్తుతానికి అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగం వాటా తగ్గగలదని పేర్కొంది. ఉత్పత్తి రంగం ఉపాధి అవకాశాలలో ఒక శాతం అభివృద్ధి అంటే కొత్తగా 6 లక్షల 25 వేల ఉద్యోగాలు లభించినట్టు లెక్క. దీనిని బట్టి ఉత్పత్తిరంగం వార్షిక అభివృద్ధి రేటు 10 శాతంగా ఉంటే ఈ రంగంలో ఉపాధి అవకాశాల అభివృద్ధి 5 శాతంగా ఉంటుందన్నమాట. ”సంవత్సరానికి 30 లక్షల కొత్త ఉద్యోగావకాశాలు ఈ రంగంలో చేకూరతాయన్నది దీని అర్థం” ఆర్థిక సేవల రంగం వాటా మొత్తం ఉద్యోగావకాశాలలో ప్రస్తుతానికి 3.4 శాతమే అయినప్పటికీ ఇది రెట్టింపు అయే అవకాశాలు ఉన్నాయి. ఐటి సంబంధిత రంగాలలోకూడా ఉద్యోగావకాశాలు బాగా పెరిగే అవకాశాలున్నాయని అధ్యయనం తెలిపింది. ప్రస్తుతం కోటీ 62 లక్షలుగా ఉన్న ఈ ఉద్యోగాలు 2015 నాటికి 3 కోట్ల 28 లక్షలకు చేరగలవని అంచనా.