ఏదేని వ్యాధి వచ్చిన వెంటనే మాత్రలు వేసుకునే అలవాటు చాలామందిలో ఉంటుంది. నిజానికి ఇటువంటి మాత్రలు వేసుకున్నప్పుడు ఉన్న జబ్బు మాయమైనప్పటికీ సదరు ఇంగ్లీషు మందు మరో కొత్తరకమైన సైడ్ ఎఫెక్ట్ను కలుగుజేస్తుంది. అదే ఏ రకంగా బయటపడుతుందో తెలియదు. ఈ సంగతి ప్రక్కనపెడితే… కొన్ని వ్యాధులకు ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే పండ్లు ఔషధాలుగా పనిచేస్తాయి.
ఉదాహరణకు పనసపండును తీసుకుంటే… దీనిలో ఉండే ఫైటో న్యూట్రియంట్స్ క్యాన్సర్ నుంచేకాక హైపర్ టెన్షన్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఆస్తమాతో బాధపడేవారికి పనస ఎంతో మేలు చేస్తుంది. పనస వేరును బాగా ఉడికించి దాని నుంచి వచ్చే రసం తీసుకుంటే ఆస్తమా అదుపులో ఉంటుంది. అలాగే పనస వేరు చర్మ వ్యాధులలోనూ చక్కగా పని చేస్తుంది.
రక్తపోటు ఉన్నవారు పొటాషియం సమృద్ధిగా లభించే పనసపండును తీసుకుంటే సమస్య తీవ్రత తగ్గుతుంది. అదేవిధంగా పనస తొనలు జ్వరం, డయారియా రుగ్మతలకు ఔషధంగా పనిచేస్తుందని విశ్వసిస్తారు. అంతేకాదు… చర్మ ఆరోగ్యాన్ని కలిగించే కణాలు త్వరగా నశించకుండా పనస కాపాడుతుంది. అలాగే ఇందులో వయసు మళ్లే లక్షణాలు తగ్గించే గుణాలు ఉన్నాయి. ఆరోగ్యానికి పనస ఎంతో మేలు చేస్తుంది.
పనస చెట్టు మొదలుకు, కొమ్మలకు, కాస్తుంది.ఇది సమశీతోష్ణ ప్రాంతాల్లోపెరుగుతుంది. ఎఱ్ఱ, నల్లరేగడి, పర్వతసానువుల్లో ఈ చెట్లు విస్తారంగా పెరుగుతాయి. ఇది జాతికి చెందిన చెట్టు. ఈ చెట్టు యొక్క అన్ని భాగాలు పనికివస్తాయి.
పనస పండులో ఈ క్రింది పోషక విలువలున్నాయి.
తేమ – 72.2%
పిండి పదార్ధాలు – 18.9%
మాంసకృత్తులు – 1.9%
సున్నము – 0.02%
క్రొవ్వులు – 0.1%
భాస్వరము – 0.03% మై.గ్రా
సేంద్రియ లవణాలు – 0.8%
ఇనుము – 0.5% మై.గ్రా
పిప్పి పదార్ధము – 1.1%
విటమిన్ – ఏ – 540 ….
విటమిన్ – సి – 10% మై.గ్రా.
పనస పండు ఇచ్చే శక్తి – 540 కేలరీలు.
ఈ పండులో ‘ఏ’, ‘సి’ విటమిన్లు స్వల్పంగా ఉంటాయి. పనస తొనలు తియ్యగా ఉంటాయి. అవి దేహానికి పుష్టినిస్తాయి. నాడిశక్తిని పెంచుతాయి. ఇది అంత త్వరగా జీర్ణంకాదు. కాబట్టి అమితంగా ఈ పండును తినరాదు. తక్కువగా తింటేనే మేలు కలుగుతుంది. లవణాలు, విటమిన్లు తక్కువ కాబట్టి, ఈ పండు జీర్ణం కావటం కాస్త కష్టం. పనస గింజల్లో తేమ చాల తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గింజలు ఇంకా కఠినంగా జీర్ణం అవుతాయి. చిన్నపిల్లల్లో జీర్ణశక్తి ఎక్కువ కాబట్టి ఈ పండును కాల్చి తింటే, వారికంత అపకారం జరగదు. అజీర్ణం, పాండు వ్యాధి, నంజు, కడుపునెప్పి, అగ్నిమాంధ్యం, క్షయ, శుక్ర నష్టం, అండవాతం మొదలైన వ్యాధులున్నవారు పనసపండును తినరాదు. చెట్టున పండిన కాయను, కోసిన వెంటనే తింటే, అదంత రుచికరంగా ఉండదు. తయారైన కాయను కోసి, నిలువ ఉంచితే, ఆ పనస తొనలు చాలా తియ్యగా ఉంటాయి. పనస చెట్టు ఆకులతో విస్తర్లు కూడా కుడుతుంటారు.
ఈ పండు విరేచనాన్ని బంధిస్తుంది. ఎక్కువగా తింటే అతిసారం కలుగుతుంది. పనస పాలను, ద్రాక్షా సారాయంలో నూరి పట్టు వేస్తే, దెబ్బ, వాపులు తగ్గుతాయి. పండిన పనస ఆకులను, వేరును చర్మ వ్యాధులకు ఉపయోగిస్తుంటారు. దీని మ్రానుతో వీణలు, మద్దెలలు చేస్తుంటారు. దీనిని సంస్కృతంలో “స్కంధఫలం” అని, హిందీలో “కటహక్-కటహర్-చక్కీ” అని, బంగ్లాలో “కాంటల్”‘ అని, మరాఠిలో “పణస” అని, ఆంగ్లంలో “ఇండియన్ జాక్ ఫ్రూట” అని అంటారు.